NEET paper leak : నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఇంకా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై సీజేపీ నేతలతో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం సీజేపీ నేతలను చర్చలకు ఆహ్వానించారు.
పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామని జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. సీజేపీ నేతలతో చర్చించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి జేపీ నద్దా ఆఫీసు లేదా ఇంటి వద్ద.. ఎక్కడైనా సీజేపీ నేతలకు అనుకూలమైన చోట చర్చలు జరుపుతామన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు. ఇది దేశంలోని విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని, చర్చలకు సహకరించాలని కోరారు. నిరసన చేస్తున్న విద్యార్థుల్ని కలిసేందుకు సిద్ధమన్నారు. చర్చల కోసం కేంద్ర ప్రభుత్వ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, విద్యార్థులకు అనువైన చోట చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.
నేతల్ని, విద్యార్థుల్ని కలిసి చర్చించడం ద్వారానే దీనికి పరిష్కారం లభిస్తుందన్నారు. మరోవైపు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తాను జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నానని, ఈ రోజు నిరసనకు హాజరు కాలేనని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. కొన్ని గంటలు విశ్రాంతి కావాలని, కోలుకుంటానని తెలిపారు. సాయంత్రానికల్లా నిరసన వేదిక వద్దకు తిరిగి వస్తానని వెల్లడించారు. జంతర్‌మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసిందని సీజేపీ ఆరోపించింది.