Arrest : కెనడా (Canada) కేంద్రంగా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలపై ఎఫ్‌బీఐ (FBI) చర్యలు చేపట్టింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పంపిణీ, ఎగుమతికి సంబంధించిన ఆరోపణలపై లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoy), జగ్గు భగవాన్‌పురియా (Jaggu Bhagavanpuria), రవీందర్ ధాండా (Ravider dhanda) గ్యాంగ్‌లను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ హార్డ్ బాల్ (Operation Hard Ball) పేరుతో దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన హర్మన్వీర్ సింగ్ (Harmanveer Singh) ను కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.
ఎఫ్‌బీఐ వివరాల ప్రకారం.. రవీందర్ ధాండా ముఠా అమెరికా, కెనడా, మెక్సికో దేశాలకు భారీ మొత్తంలో కొకైన్, ఇతర మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాలో సభ్యుడైన హర్మన్వీర్ సింగ్‌పై జూన్ 23న అమెరికా ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ క్రమంలోనే తాజాగా అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ నెల ప్రారంభంలో అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో.. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలకు చెందిన 24 మందిని అరెస్ట్ చేశాయి. వీరిలో 11 మందిని కాలిఫోర్నియాలోనే పట్టుకున్నారు.