సిద్దిపేట జిల్లా రైతులు ఆయిల్‌పామ్ సాగులో బ్రాండ్ అంబాసిడర్లు కావాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కానే కాదు.. నీళ్లు రానేరావు.. అని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాట్లాడారని, కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నీరు తెచ్చుకున్నామని, ఎండాకాలంలోనూ అన్నదాతలకు పుష్కలంగా సాగు నీరందుతున్నదన్నారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మీకు కరెంట్ ఉండదు.. తెలంగాణలో చీకటి ఉంటుందని ఎద్దేవా చేశారన్నారు. ఇప్పుడు ఏపీలో చీకటి ఉంది తప్పా తెలంగాణలో కాదన్నారు. 24గంటల కరెంటు ఇచ్చి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.
ఇంట్లో నుంచి రైతు బయట కాలు పెట్టకుండా ఎకరానికి రెండు పంటలకు గాను రూ.10వేల పెట్టుబడి ఇస్తున్నారన్నారు. వ్యవసాయం చేసి రైతులు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆనందం ఉంటుందన్నారు. ‘రైతులు వరి ఒకటే పండిస్తున్నరు.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతే రాజు కావాలన్నది సీఎం కేసీఆర్ కల.. వరి వేస్తే రూ.20వేలు లేదా రూ.25 వేలు మిగులుతుంది.. కానీ, రైతు ఆదాయం పెరగాలన్నది మా తండ్లాట’.. అని అన్నారు. ‘అందుకే మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో ఆయిల్‌పామ్ జిల్లాగా సిద్దిపేటను డిక్లేర్ చేయించినం.. ఎకరానికి రూ.80వేల సబ్సిడీ ఇస్తున్నం.. డిప్ కంపెనీలకు సబ్సిడీ పెంచినం’ అని అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చాలామందిని పంపినం.. కండ్లతో చూసి వచ్చిండ్రు.. తెలంగాణ వచ్చాక మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేటలో పెడుతున్నాం’.. అని పేర్కొన్నారు. కోతులు, పందులు, చీడ పీడలేని పంట.. ధర రాదనే బాధ లేదు.. ఎకరానికి తక్కువలో తక్కువ రూ.1.50లక్షల నికర లాభం వస్తుందన్నారు. పంట కొనేది ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్.. ఫ్యాక్టరీ మన జిల్లాలోనే ఉందన్నారు.
గవర్నమెంట్ ఉద్యోగికి జీతం ఎంత వస్తదో? ఆయిల్‌పామ్ రైతుకు అంతే వస్తదన్నారు. దేశం లక్ష కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుందన్నారు. దేశంలో పండకనే పక్క దేశం నుంచి తెచ్చుకుంటున్నామని, నూనె పంటల సాగు దేశంలో తక్కువ అని, పామాయిల్‌కు మంచి డిమాండ్ ఉంటదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతులు పామాయిల్ సాగు చేస్తే బాగుపడతారని, జూలై నెల కల్లా 20వేల ఎకరాలకు మొక్కలు రెడీగా ఉన్నాయన్నారు. ఇప్పటికే 3వేల ఎకరాల్లో పంట వేశామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రతీ మండలంలో పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు పెట్టేలా కృషిచేయాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తొండాట ఆడుతున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బియ్యం కొనకుండా నాటకాలు ఆడుత్నునదన్నారు. ఎంత ఖర్చు అయినా ఆ నష్టం మనం భరిద్దాం.. రైతును నిలబెడుదామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చారనపి తెలిపారు. అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అశాంతికి బీజేపీ కుట్ర చేస్తున్నదని, రైతులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలను అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట వేస్తే భారత ప్రభుత్వమే తెలంగాణ రైతుల వద్దకు వచ్చి, బతిమాలి ఆయిల్‌పామ్ పంటను తీసుకునే పరిస్థితి వస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎనిమిదేండ్ల తెలంగాణలో 24గంటల కరెంటు ఇస్తుంటే, ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయన్నారు. వాళ్లు ఒక్క పెద్ద సాగునీటి ప్రాజెక్టు కట్టలేదన్నారు. సర్కారు సంస్థలు, ఆస్తులు కారు చౌకగా అంబానీ, ఆదానీకి అమ్మేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. పత్తి విత్తన ప్యాకెట్ మీద కేంద్రం రూ.43 పెంచిందని, తెలంగాణలో కోటి 50లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులు వినియోగిస్తున్నారని, కోట్లాది రూపాయల భారం రైతుల మీద వేయడం తగునా? అని బీజేపీ నాయకులను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.