సిద్దిపేట, ఏప్రిల్ 9 : ‘కష్టంగా కాదు.. ఇష్టపడి చదువండి.. దించిన తల ఎత్తకుండా చదివితే జీవితాంతం తలెత్తుక బతుకుతారు’. ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణా శిబిరానికి నిజమైన సార్థకత అని, అవనిగడ్డ, హైదరాబాద్ శిక్షణా కేంద్రాల కంటే సిద్దిపేటలో అద్భుతమైన శిక్షణ ఇస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఉచిత టెట్ శిక్షణా తరగతులను మంత్రి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పా రు. ఇప్పటి వరకు 223 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. నిరుద్యోగ యువత శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళితే వేలాది రూపాయలు ఖర్చు అవుతాయని భావించి, సిద్దిపేటలో కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులతో పాటు భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే జీవింతాంతం సంతోషం గా ఉండవచ్చన్నారు. మీరు ఉద్యోగాలు సాధించినప్పుడే.. మాకు మరింత ప్రోత్సాహం ఉంటుందన్నారు. అభ్యర్థులు సెల్ఫోన్లు, ఇంట్లో టీవీలను బంద్ చేయాలని సూచించారు. మంత్రిగా నేనే సోషల్ మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తలకు తికమకపడ్డానని, వాటిని నమ్మవద్దన్నారు.
తలదించి చదవండి.. తలెత్తుకు జీవించండి..
రెండు నెలలు తల ఎత్తకుండా చదివితే జీవితాంతం తలెత్తుకునేలా బతుకుతారని టెట్ అభ్యర్థులకు మంత్రి సూచించారు. ఉపాధ్యాయ ఉ ద్యోగం కోసం కాకుండా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాలన్నా రు. గ్రూప్స్ పరీక్షల్లో ఇంటర్వ్యూల పేరిట మోసం జరుగుతుందని, ఇవి జరగకుండా సీఎం కేసీఆర్ మెరిట్ సాధించిన విద్యార్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంటర్వ్యూలు ఎత్తివేదామని సూచించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, రైల్వే శాఖలోనే ఏడేండ్లలో ఒక్క ఉద్యోగం భర్తీ చే యలేదన్నారు. సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి కో చింగ్ సెంటర్ వరకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. గతంలో శిక్షణ శిబిరానికి హాజరై ఉద్యోగాలు సాధించిన వంశీకృష్ణ, స్రవంతి, రాములు, రాజబాబు, గోవింద్ తదితరులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, పొన్నాల సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు యాదగిరి, మెరుగు మహేశ్, నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.