
సిద్దిపేట, జనవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లాస్థాయి అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుల నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధ్దిదారులను తొలి విడుతగా ఎంపిక చేయనున్నారు. జిల్లాస్థాయిలో ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో సమావేశం జరుగనున్నది. లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒక ఇంటి నుంచి ఒక్క లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు. ప్రభుత్వం రూపొందించిన యూనిట్లలో లబ్ధిదారులకు ఇష్టమైన దానిని ఎంచుకోవచ్చు. లబ్ధిదారుడు జిల్లాలో ఎక్కడైనా యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో రూ. 10 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ నిధులతో తాము జీవనోపాధి పొందడానికి ఏది అనుకూలమైందో ఆ యూనిట్‌ను ఎంపిక చేసుకొని ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దళితుల స్థితిగతులను మార్చాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారు. సిద్దిపేట జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 1,87,508 మంది ఎస్సీలు ఉండగా, వీరిలో పురుషులు 93,100, మహిళలు 94,408 మంది ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 42,191, సిద్దిపేటలో 41,099, గజ్వేల్‌లో 50,092, హుస్నాబాద్‌లో 22,704(సిద్దిపేట జిల్లాలోని మండలాలవి మాత్రమే), జనగామ నియోజకవర్గంలో 22, 477, మానకొండూరు (బెజ్జంకి మండలం)లో 8,945 మంది ఉన్నారు.