న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్.. డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) యాప్‌లో అప్పీల్ ఫీచర్ (విజ్ఞప్తి అవకాశం)ను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది. శుక్రవారం ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటి.. పునరుద్ధరించిన డీఎన్డీ, మైస్పీడ్ యాప్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. టెలికాం ఆపరేటర్లు అసంతృప్తికరంగా పరిష్కరించిన ఫిర్యాదులపై ఉన్నతాధికారుల చర్యల కోసం వినియోగదారులు మళ్లీ విజ్ఞప్తి చేసుకునే వీలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే డీఎన్డీ అప్లికేషన్ (యాప్)లో అప్పీల్ వెసులుబాటును కల్పించే దిశగా వెళ్తున్నట్టు చెప్పారు.
ఇక కొత్త డీఎన్డీ యాప్ ద్వారా స్థానిక భాషల్లో స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను రిపోర్ట్ చేయవచ్చని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా మొబైల్ వినియోగదారులు తమ ఫోన్‌కు ఎవరు ఎస్ఎంఎస్లను, 1,600 సిరీస్ నెంబర్లను పంపిస్తున్నారనేదాన్ని కూడా తెలుసుకోవచ్చని వివరించారు. మైస్పీడ్ యాప్‌లోనూ స్థానిక భాషలను వాడుకోవచ్చని స్పష్టం చేశారు. దీనిద్వారా మొబైల్ నెట్‌వర్క్‌తోపాటు ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బాండ్, వైఫైలలో ఇంటర్నెట్ స్పీడ్‌ను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త యాప్‌లలో అనేక నూతన ఫీచర్లను తెచ్చామన్నారు. ఇదిలావుంటే వచ్చే నెలలో మైకాల్ యాప్‌ను సరికొత్తగా పరిచయం చేస్తామని లహోటి ఈ సందర్భంగా తెలిపారు.