న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : బంగారం, వెండి ధరల పోకడ.. స్పాట్, ఫ్యూచర్ మార్కెట్లలో భిన్నంగా సాగుతున్నది. శుక్రవారం దేశీయ రిటైల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే కమోడిటీ ఎక్సేంజ్‌లో మాత్రం పెరుగడం గమనార్హం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,400 లేదా 1.5 శాతం క్షీణించి రూ.1,58,500గా నమోదైంది. అలాగే కిలో వెండి రేటు రూ.13,500 లేదా 5.03 శాతం పతనమై రూ.2,55,000 వద్ద స్థిరపడింది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఏప్రిల్ డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం ధర రూ.1,044 లేదా 0.68 శాతం బలపడి రూ.1,53,880గా పలికింది. ఇక మార్చి డెలివరీకిగాను సిల్వర్ కాంట్రాక్ట్స్ కిలో రేటు రూ.5,465 లేదా 2.31 శాతం పుంజుకొని రూ.2,41,900గా ట్రేడైంది.
లోకల్ మార్కెట్లో గతకొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ చెప్తున్నది. ఈ క్రమంలోనే రేట్లలో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులను చూడాల్సి వస్తున్నదని అంటున్నది. ధరల్లో స్థిరత్వం లోపించడం వల్ల వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నదని జ్యుయెల్లర్స్ చెప్తున్నారు. కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారని అంటున్నారు. దీంతో రాబోయే పెండ్లిళ్ల సీజన్ దృష్ట్యా.. మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. దేశీయ మార్కెట్‌పై గట్టిగానే ఉందని, అందుకే అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతున్నాయని, పెరిగితే పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్ తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు కూడా కీలకమేనని పేర్కొంటున్నారు. మదుపరులు ఈక్విటీ మార్కెట్లలోని తమ పెట్టుబడులకు రక్షణ కవచంగా గోల్డ్, సిల్వర్‌ను పెట్టుకుంటున్నారని, ఈ పరిస్థితి కూడా ధరలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నదని అంటున్నారు.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు దాదాపు 1 శాతం పెరిగి 4,968.40 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 3 శాతం ఎగిసి 77.30 డాలర్లుగా నమోదైంది. ఫ్యూచర్ మార్కెట్లోనూ గోల్డ్ వాల్యూ 0.81 శాతం వృద్ధితో ఔన్స్ 4,962 డాలర్లు పలికింది. సిల్వర్ విలువ కూడా 2.49 శాతం ఎగబాకి 77.15 డాలర్లను చేరింది. నిజానికి అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ మధ్య భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాలతో గోల్డ్-సిల్వర్ మార్కెట్లో గతకొద్ది రోజులుగా ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. సురక్షిత పెట్టుబడుల నుంచి రిస్కీ పెట్టుబడుల వైపునకు ఇన్వెస్టర్లు వెళ్తున్నారు మరి. అయితే అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకు ముందు మదుపరులలో అయోమయం నెలకొన్నదని.. అందుకే గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లను పెంచారని విశ్లేషకులు తాజా పరిస్థితుల్ని అభివర్ణిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు శుక్రవారం బాగా పడిపోయాయి. మార్కెట్‌వ్యాప్తంగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలకు ముందు మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అందువల్లే రేట్లలో ఈ పతనం సంభవించింది.