హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. హుసేన్సాగర్ కట్ట ఈ రెండు నగరాలను వేరుచేస్తున్నది. కవాడిగూడ ప్రాంతంలో రోడ్డుకు ఒకవైపు సికింద్రాబాద్ అయితే రెండవ వైపు హైదరాబాద్. ఈ రెండు నగరాలను వేరుచేసేది, కలిపేది ఒక రోడ్డే. కానీ రెండు ప్రాంతాల మధ్య చాలా తేడా ఉంటుంది. సికింద్రాబాద్ ప్రశాంతమైన నది అయితే హైదరాబాద్ రణగొణ ధ్వనులతో హడావుడిగా ఉంటుంది.
ఒకప్పుడు సికింద్రాబాద్‌ను లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవారు. సికింద్రాబాద్ నగరం 1806లో ఏర్పడింది. 2006లో పాలకులు సికింద్రాబాద్ 200 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రత్యేకతను నిలబెడతామని అప్పుడు బోలెడు హామీలు ఇచ్చారు. ఏకంగా ఇప్పుడు సికింద్రాబాద్ అస్తిత్వాన్నే మాయం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలు, చారిత్రక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఈ విభజన జరిగి ఉంటే బాగుండేది. కానీ రాజకీయ గురువు మీద అభిమానం, ఒక ప్రాంతం పట్ల నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తున్నది. సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ కార్పొరేషన్లుగా మూడు కార్పొరేషన్లు చేస్తున్నారు. నిజాం ప్రభుత్వ హ యాంలోనే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంటే అప్పుడు మల్కాజ్గిరి ఒక గ్రామ పంచాయతీ. సాధారణంగా గ్రామ పంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తారు. కానీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను పంచాయతీలో విలీనం చేయరు. కనీస పరిజ్ఞానం ఉన్నవారెవరూ ఇలా చేయరు.
సికింద్రాబాద్ ప్రాంతంలో తొలుత ఉళ్వుల్ అనే గ్రామం ఇప్పటి అల్వాల్‌కు సమీపంలో ఉండేది. హుసేన్‌సాగర్‌కు ఉత్తర భాగంలో ఉండే ఈ ప్రాంతాన్ని నిజాం ఇచ్చారు. 1798లో నిజాం అసఫ్ జా-2 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ శివారులో బ్రిటిష్ సైన్యం శిబిరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఇచ్చారు.
1803లో మూడవ నిజాం సికందర్ జా తన పేరు మీదుగా ఈ ప్రాంతానికి సికిందరాబాద్ అని పేరు పెట్టారు. 1806లో అధికారికంగా బ్రిటిష్ కంటోన్మెంట్‌గా ఏర్పడింది. సికింద్రాబాద్‌ను పాతతరం వారు ఇప్పటికీ లష్కర్ అనే పిలుస్తారు. అప్పట్లో ఈ ప్రాంతానికి లష్కర్ అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉండేది.
లష్కర్ అంటే సైన్య శిబిరం అని అర్థం. కాలక్రమేణా లష్కర్ అనే పేరు వాడుకలో లేకుండా పోయింది. బ్రిటిష్ సైన్యం స్థానంలో ఇక్కడ కంటోన్మెంట్లో భారతీయ సైన్యం ఉంటుంది. ఈ కంటోన్మెంట్‌లోనే రాష్ట్రపతి నిలయం ఉన్నది. ఇది రాష్ట్రపతి వేసవి విడిది. అజంతా టాకీస్ దగ్గరలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన క్లాక్‌టవర్ ఇప్పటికీ తలెత్తుకొని నిలబడి సమయాన్ని చూపిస్తున్నది. విక్టోరియా కాలంలో బ్రిటిష్ అధికారుల గౌరవార్థం 1897లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ నిర్మించారు. దీని పక్కనే 1969 తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నిర్మించారు.
1945లో బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రాంతంలో స్థానిక పరిపాలన కోసం తొలిసారి సికింద్రాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1950లో హైదరాబాద్ కార్పొరేషన్ యాక్ట్ కింద సికింద్రాబాద్ మున్సిపాలిటీని సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. అంటే ఒకవైపు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరోవైపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు పనిచేసేవి.
1955లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రచురించిన సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సావనీర్ పీడీఎఫ్ కాపీ దొరికింది. దీనిలో సికింద్రాబాద్ చరిత్రతో పాటు సికింద్రాబాద్ కార్పొరేషన్ మరింతగా అభివృద్ధి చెందాలని సికింద్రాబాద్ ప్రాంతాన్ని, చరిత్రను కీర్తిస్తూ నిజాం (హైదరాబాద్ రాజ్ ప్రముఖ్) ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, అప్పటి మంత్రులు గోపాల్‌రావు ఎగ్బోటే, వినాయక్‌రావు, విద్యాలంకార్, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, డాక్టర్ జీఎస్ మేల్కొటే, నవాజ్ జుంగ్ బహదూర్‌ల సందేశాలు ఉన్నాయి.
అప్పటి మేయర్ రంగ పాండు. 1954-55లో ఎస్ఆర్ వెంకటేశం సికింద్రాబాద్ మేయర్‌గా ఉండేవారు. జూబ్లీ బస్ డిపో వద్ద ఒకవైపు రంగ పాండు విగ్రహాన్ని ఇటీవల పెద్దలు నిర్మించారు. ఆయన ఎవరో? ఆ విగ్రహం ఎందుకు నిర్మించారో ఈ తరం వారికి తెలియదు. వీళ్లందరూ తమ సందేశాల్లో సికింద్రాబాద్‌కు మరింత గుర్తింపు తేవడానికి జరపాల్సిన కృషి గురించి ప్రస్తావించారు. 1950లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఓ ఐదేండ్లు పాలన సాగింది. 1955లో సికింద్రాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు ప్రకటించారు. అప్పటి రాజ్ ప్రముఖ్ నిజాం మొదలుకొని ముఖ్యమంత్రి బూర్గుల వరకు హేమాహేమీలంతా సికింద్రాబాద్ అభివృద్ధి అవసరాన్ని వివరించారు. కానీ దురదృష్టం.. వీరి మాటలు అమలుకు నోచుకోలేదు సరికదా, ఆ వెంటనే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని నిర్ణయించారు. 1955లో చేసిన నిర్ణయం 1960లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైంది.
క్లాక్ టవర్ సింబల్‌తో 2006లో సికింద్రాబాద్ 200 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాణిగంజ్ తర్వాత వచ్చే బూర్గుల రామకృష్ణారావు భవన్ వద్ద క్లాక్ టవర్ సింబల్‌తో ఒక స్మారక చిహ్నం నిర్మించారు. ఈ చిహ్నాన్ని ఈ మధ్య చూస్తే పెచ్చులు ఊడిపోయి అనామకంగా ఉన్నది. హైదరాబాద్‌ది 500 ఏండ్ల చరిత్రయితే సికింద్రాబాద్ చరిత్ర 200 ఏండ్ల నాటిది. వాతావరణంతో పాటు మొత్తం సికింద్రాబాద్ భిన్నంగా ఉంటుంది. ఈ తరం వారికి అనుభవం లేకపోవచ్చు. కానీ నాలుగైదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరం మతకలహాలతో అట్టుడికిపోతున్నా సికింద్రాబాద్ ప్రశాంతంగా ఉండేది. కవాడిగూడ, పద్మశాలి కాలనీ, ముషీరాబాద్, భోలక్‌పూర్ ప్రాంతాలు సికింద్రాబాద్-హైదరాబాద్ మధ్యలో ఉంటాయి.
నా బాల్యమంతా ఈ ప్రాంతంలోనే గడిచింది. సికింద్రాబాద్‌తో విడదీయరాని అనుబంధం. ఇప్పుడు ఈ ప్రాంతం పేరును చెరిపేయాలనే ప్రయత్నం దుర్మార్గం. సైబరాబాద్ ఒక నగరం కాదు. నగరంలో ఒక భాగం మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు తాను ఒక నగరాన్ని నిర్మించానని, అది సైబరాబాద్ అని పదే పదే చెప్తారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారు. గురువు మీద ప్రేమ ఉండవచ్చు కానీ సికింద్రాబాద్ ఏం పాపం చేసింది?
దినపత్రికలన్నీ హైదరాబాద్ నుంచి ప్రచురిస్తే.. నిజాం కాలంలోనే సికింద్రాబాద్ నుంచి డక్కన్ క్రానికల్ను సికింద్రాబాద్ నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పత్రిక నిరంతరంగా వెలువడుతున్నది. 1960లో సికింద్రాబాద్ నుంచి తొలి తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి వెలువడింది. సికింద్రాబాద్ అనేది ప్రముఖ వ్యాపార కేంద్రం. బట్టలు, బంగారు వ్యాపారం, విద్యాసంస్థలు, కంటోన్మెంట్ ఏరియాతో ప్రత్యేకత చాటుకుంటున్నది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానంగా నిలుస్తున్నది. సికింద్రాబాద్‌తో పోలిస్తే మల్కాజ్గిరి పేరు ఏ విధంగా సరైనదో నిర్ణయం తీసుకున్న తుగ్లక్‌లకే తెలియాలి. స్థానిక శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని ఉద్యమం చేయగా.. అందుకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నేతలతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఉత్తుత్తి ఆందోళన చేయించింది. కంటోన్మెంట్ ప్రాంతంపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్రం. సికింద్రాబాద్‌పై వారికి నిజంగా అభిమానం ఉంటే సికింద్రాబాద్ ప్రాంతం, కంటోన్మెంట్ ప్రాంతాన్ని కలిపి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ఉద్యమించేవారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీనే క్రమంగా అంతర్థానం అవుతున్నది. ప్రస్తుతం రెండు రాష్ర్టాల్లో నే అధికారానికి పరిమితమైంది. కాంగ్రెస్ ఏమీ శాశ్వతం కాదు. మళ్లీ సికింద్రాబాద్ తలెత్తుకొని నిలుస్తుంది, తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. నాయకులు శాశ్వతం కాదు. ఓ ఏడాది గడిస్తే ఎవరి మాట ఎవరూ వినరు. మరో మూడేండ్ల్లు గడిస్తే పెట్టె, బేడా సర్దుకోవాలి.
స్థానిక శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని ఉద్యమం చేయగా..అందుకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నేతలతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఉత్తుత్తి ఆందోళన చేయించింది. కంటోన్మెంట్ ప్రాంతంపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్రం. సికింద్రాబాద్‌పై వారికి నిజంగా అభిమానం ఉంటే సికింద్రాబాద్ ప్రాంతం, కంటోన్మెంట్ ప్రాంతాన్ని కలిపి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ఉద్యమించేవారు.
– బుద్దా మురళి