న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనల వేళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రధాన్ రాజీనామాను త్యాగంగా అభివర్ణిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా ప్రధాన్ హయాంలో జాతీయ విద్యా విధానం అమలు, డిజిటల్ విద్యా ప్రచారాన్ని ప్రశంసించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకే ఈ రాజీనామా అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు నబీన్ మాట్లాడుతూ ప్రధాన్ నిర్ణయం అత్యున్నత నిజాయితీకి నిదర్శనమని కీర్తించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యా సంవత్సరం వృథా కాకుండా సమయానికి రీ ఎగ్జామ్స్ నిర్వహించి, ఫలితాలను వెలువరించడంలో మాజీ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కాగా ధర్మేంద్రరాజీనామాతో దేశాన్ని అస్థిరపరిచే విదేశీ శక్తుల కుట్ర భగ్నమైందని మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ వర్గీయ అన్నారు. కాగా విద్యా రంగంలో వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ నేతల ప్రకటనలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.