భద్రాచలం, సెప్టెంబర్ 27: ఎగువన కురుస్తున్న వర్షాలు, జలాశయాల్లోని నీటి విడుదల కారణాలతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగి ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఛత్తీస్గఢ్ – తెలంగాణ మధ్య ఉన్న 163వ జాతీయ రహదారిపై వాజేడు మండలంలో గోదావరి నీరు ప్రవహిస్తుండటంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువన మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శబరి నది ప్రవాహం గోదావరిలో కలుస్తున్నది. పర్ణశాలలో ఉన్న సీతాకుటీరం నీట మునగడంతో భక్తులను అటువైపు అనుమతించడంలేదు. సోమవారం వరకు వరద క్రమేపీ తగ్గే అవకాశం ఉన్నదని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.