యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27: దళిత యువత కేసీఆర్ వైపే ఉన్నారని, యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో దళితులు కేసీఆర్ పాట పెట్టుకుని నృత్యం చేసిన ఘటనే ఇందుకు ఉదాహరణ అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా గురువారం దళిత యువకులు డీజేలో కేసీఆర్ పాటపై చిందులు వేస్తే పట్టణ సీఐ భాస్కర్ విచక్షణ కోల్పోయి వారిని అసభ్యంగా దూషించారని, 8 మంది దళిత యవకులను 50 గుంజీలు తీయించి, బెల్టుతో చితకబాదారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. సైదాపురం గ్రామానికి ఆదివారం వెళ్లి బాధిత దళిత యువకులను పరామర్శించారు.
డీఎస్పీ శ్రీనివాస్ నాయుడుతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలో దళితులపై దాడులు జరుగుతుంటే ఎమ్మెల్యే బీర్ల్ల అయిలయ్య ఎందు కు మౌనం వహిస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాట అంటేనే బీర్ల అయిలయ్యకు ఎందుకంత భయమని నిలదీశారు. దళితులకు భూమిని పంపిణీ చేస్తామని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బీర్ల అయిలయ్య ముందు మాసాయిపేట సర్వే నంబర్ 726లో దళితుల భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
లేకపోతే బీర్లను దళిత ద్రోహిగా ప్రకటిస్తామని హెచ్చరించారు. మోటకొండూర్‌లో దళితుల భూమిని స్వాధీనం చేసుకుని ఎమ్మార్వో కార్యాలయాన్ని నిర్మిస్తున్న సంగతి దళిత బిడ్డలు గమనిస్తున్నారని చెప్పారు. సొంత గ్రామంలో కేసీఆర్ పాటలను ఓర్వలేక సీఐ భాస్కర్‌తో దళితులపై విచక్షణారహితంగా దాడి చేయించారని ఆరోపించారు. దాడి చేయలేదని చెప్తున్న సీఐ భాస్కర్ 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఐ కార్యాలయంలో రికార్డయిన సీసీ ఫుటేజీని బయటపెట్టాలని అన్నారు. దళితుల గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే తక్షణం స్పందించి సీఐని సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు.