న్యూఢిల్లీ, జూలై 26: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఏదో సాధించినట్టు, విద్యావ్యవస్థ ప్రక్షాళన అయిపోతుందని భావించడం అమాయకత్వమే అవుతుంది. విద్యావ్యవస్థలో దిగజారుతున్న ప్రమాణాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణం మంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి ఎంతమాత్రం కాదు. ప్రస్తుతం దేశం తీవ్రమైన పాలనాపరమైన లోపంతో సతమతమవుతున్నది. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన రాజకీయ శక్తుల చిత్తశుద్ధి కాని, సమర్థవంతమైన పాలనకు అవసరమైన నైపుణ్యాలు కాని లేవని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కే ఝా పేర్కొన్నారు. ఇటీవల దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఆయన ది వైర్ వెబ్సైట్లో విశ్లేషించారు. ఆయన అభిప్రాయాల ప్రకారం..
ఆ వైఫల్యాలన్నీ మంత్రుల వేనా?
లద్దాఖ్‌లో భారత భూమిని చైనాను ఆక్రమించుకుంటుంటే మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మౌన ప్రేక్షకుడిలా చూస్తున్నారు, భారత్‌కు నష్టం జరుగుతున్నా అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతకానితనంతో వ్యవహరిస్తున్నారు అని ఎవరన్నా విమర్శిస్తే అంతకన్నా అమాయకత్వం ఉండదు. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఏ ప్రధాన నిర్ణయానికైనా కర్త, కర్మ, క్రియ అన్నీ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలే. వీరి కనుసన్నల్లోనే ఇలాంటి వాటిపై నిర్ణయాలు జరుగుతాయి. వాటిని కేవలం అమలు చేయించే పాత్రధారులు మాత్రమే ఈ కేంద్ర మంత్రులు. ఒక విధంగా చదరంగంలో పావులు లాంటి వారు మాత్రమే. ఆడించేది మాత్రం ఆ ఇద్దరే. ఇటీవల జరిగిన విద్యార్థి ఉద్యమంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చేయించిన రాజీనామా కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే ఆ శాఖలోని ప్రధాన నిర్ణయాలు తీసుకునేది మోదీ, అమిత్ షాలే కాబట్టి. వీరి ద్వంద్వ ఆధిపత్యమే రాజకీయ, పరిపాలన మానవ వనరుల వ్యవస్థలను నియంత్రిస్తున్నది. ఈ రంగాల్లో జరిగే ఏ కీలక పరిణామం అయినా వీరి కనుసన్నలను దాటి అంగుళం కూడా ముందుకెళ్లదన్నది జగద్విదితం.
నిబద్ధత లేని నేత రాహుల్ గాంధీ
దేశం ఈ పరిస్థితుల్లో ఉంటే దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విశ్వసనీయమైన ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తింపు పొందలేక పోయారు అన్న ప్రశ్న వస్తుంది. జాతి అతడిని నెహ్రూ వారసునిగా గుర్తించడం లేదు. అతడు జరిపే రాజకీయాలే అతడిని ఒక విశ్వసనీయమైన విపక్ష నేతగా గుర్తింపు తీసుకు రావడం లేదు. రాజ్యాంగ సూత్రాల పట్ల ఆయనకు నిబద్ధత లేదు. దీంతో ఆయన విలువ శూన్యం అయ్యింది. ఆయన ఇంతకాలం తన రాజకీయాల వల్ల నిలదొక్కుకున్నారే తప్ప తన వ్యక్తిగత గుర్తింపు వల్ల కాదు.
మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారమవుతుందా?
ఒక మంత్రి రాజీనామా చేయాలనడం, అతను రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనుకోవడం సరికాదు. సమస్య అలాగే ఉంటుంది. వ్యవస్థ కూడా అదే. వ్యక్తులు మారుతుంటారు. రాజీనామా చేయించడం అనేది ఆత్మకు సంతృప్తి కలిగించే విషయం మాత్రమే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరో వ్యక్తి ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. కేంద్రం ఆధ్వర్యంలో అదే ఆర్ఎస్ఎస్ విద్యా విధానం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, లోపభూయిష్టమైన విదేశాంగ విధానం, విభజన వాద ఎజెండా కొనసాగుతూనే ఉంటుంది. విపక్షాలు యథావిధిగా బీజేపీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూనే ఉంటారు. దేశంలో ద్వంద్వ ఆధిపత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు. వీటిపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలను ప్రారంభిస్తుందా, విపక్షాలతో తమ పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటుందా? అన్నది జవాబులేని ప్రశ్నలే.