Rayapole Student | రాయపోల్, జనవరి 10 : ఇటీవల కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో సిద్ధిపేట జిల్లా రాయపోల్
మండలానికి చెందిన పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ రాయపోల్ పాఠశాల మరోసారి ప్రతిభను చాటుకుంది. ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థి నిశాంత్ రెడ్డి వినూత్న ఆలోచనతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది.
గైడ్ టీచర్ కే. స్వాతి ఆధ్వర్యంలో నిశాంత్ రెడ్డి మొక్కజొన్న పొట్టుతో బయో ప్లాస్టిక్ తయారీ (Bioplastic from Corn Husk)అంశంపై చేసిన ప్రదర్శనకు న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు లభించాయి. పర్యావరణ హితంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.
ఈ ప్రదర్శనకుగాను తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలు పాల్గొనే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు నిశాంత్ రెడ్డి ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఈ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి నిశాంత్ రెడ్డి, గైడ్ టీచర్ కే. స్వాతి, రాయపోలు పాఠశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విజయంతో పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేయడంతోపాటు నిశాంత్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.