న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో ఎల్పీజీ సంక్షోభంపై శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. మోదీజీ-ఎల్పీజీ.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ పురి.. దేశ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తొలుత టీఎంసీ ఎంపీలు పోస్టర్లు, గ్యాస్ సిలిండర్ కటౌట్లు పట్టుకొని నిరసన చేపట్టారు. ‘గ్యాస్ సిలిండర్లు ఎక్కడికి పోతున్నాయి?’ అంటూ అధికార బీజేపీని ప్రశ్నించారు. కొద్దిసేపటికి.. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీలు కూడా వారితో చేరారు. ఎల్పీజీ సిలిండర్ల మాదిరే ప్రధాని మోదీ కూడా అదృశ్యమవుతున్నారని విపక్ష ఎంపీలు విమర్శించారు. గత ఐదు రోజులుగా ప్రధాని మోదీ సభకు రావటం లేదని, తీవ్రమైన సంక్షోభం కొనసాగుతున్నా, ఆయన కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా విమర్శించారు. ‘ఆయన ప్రధాని కాదు, ఎన్నికల యంత్రంగా మారారు. నిజంగా ఇది సిగ్గుచేటు’ అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ లాంటి చోట ప్రధాన డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కుప్పకూలిందని, పెట్రోలియం మంత్రి దేశానికి అబద్ధం చెబుతున్నారని మహువా మెయిత్రా ఆరోపించారు. పశ్చిమాసియాలో పరిస్థితి.. భారత్‌పై దాని ప్రభావంపై పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ జరగాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
ఎల్పీజీ కొరత నివారణకు కేంద్రం చర్యలు చేపట్టాలి
దేశంలో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరత నివారణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు శుక్రవారం డిమాండ్ చేశారు. ఎల్పీజీ గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. దీంతో వారు ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన వంటచెరకు, బొగ్గును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. మనమంతా సమష్ఠిగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, వ్యాపార సంస్థలు కోరిన మేరకు గ్యాస్ సరఫరా అయితే వారు భయాందోళన చెందరని ఎంపీ కార్తీ చిదంబరం పేర్కొన్నారు. గ్యాస్ కొరతతో ఏర్పడిన పరిస్థితులపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బయట ప్రాంతాల్లో ఉన్న విద్యార్ధులకు ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎల్పీజీ కొరత లేదు: కేంద్రం
ఒకవైపు దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు ఆకాశాన్నంటుతుంటే, ఎప్పటిలాగే సంక్షోభం ఏమీలేదంటూ కేంద్రం మరో ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఏమీలేదని కేంద్రం శుక్రవారం పునరుద్ఘాటించింది. గ్యాస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 30 శాతం మేర పెరిగిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. ‘యుద్ధానికి ముందు రోజుకు 55.7 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 75.7 లక్షలకు పెరిగిపోయింది’ అని ఆమె పేర్కొన్నారు. వదంతులు నమ్మి అవసరం లేకపోయినా ప్రజలు గ్యాస్ బుకింగ్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) సౌకర్యం ఉన్న 60 లక్షల కుటుంబాలు ఆ సౌలభ్యాన్ని వాడుకోవాలని, బ్లాక్‌లో ఎల్పీజీని విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
దేశంలో వంట ఇంధన వినియోగం ఇలా..