GST : జూలై నెలకు సంబంధించిన గూడ్స్ అండ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్ల వివరాలు వెల్లడించింది కేంద్రం. జూలైలో రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వసూళ్లు రూ.39,835 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వసూళ్లు రూ.47,881 కోట్లుకాగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) వసూళ్లు రూ.1.23 లక్షలుగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే గతేడాది ఇదే నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లలో 15.4 శాతం పెరుగుదల ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం ఇది రెండోసారి.
చివరగా గత ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.43 లక్షల కోట్లు వచ్చాయి. ఈ వివరాల్ని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం, ఆగష్టు 1న విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించి రీఫండ్లు కూడా 13.1 శాతం పెరిగి, రూ.29,968 కోట్లకు చేరాయి. విదేశీ దిగుమతుల ద్వారా జీఎస్టీ రెవెన్యూ 28.8 శాతం పెరిగింది. వరుసగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతం అని నిపుణులు అంటున్నారు. జీఎస్టీ వసూళ్లలో హరియాణా అత్యధిక వృద్ధి సాధించింది. అదే సమయంలో గుజరాత్ రెండో స్థానంలో, తెలంగాణ కూడా భారీ వృద్ధి (19 శాతం) నమోదు చేసింది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లపై ఆర్బీఐ అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనున్నట్లు చెప్పింది.
దీనిప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్-ఇంటరెస్ట్ రేట్ ఆన్ డిపాజిట్స్) సెకండ్ అమెండ్మెంట్ డైరెక్షన్స్, 2026 ప్రకారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఒక రోజున కస్టమర్లు డిపాజిట్ చేసే మొత్తాలకు, ఒక అమౌంట్‌కు అన్ని బ్రాంచులలో ఒకే వడ్డీ రేటు చెల్లించాలని ఆదేశించింది. బల్క్ డిపాజిట్లతోపాటు అన్ని రకాల డిపాజిట్లపై వేర్వేరు బ్రాంచుల్లో అయినా సరే ఒక అమౌంట్‌కు, ఒకే రకమైన వడ్డీ చెల్లించాలని, ఈ విషయంలో వివక్ష ఉండకూడదని కూడా ఆర్బీఐ ఆదేశించింది.