కీవ్: రష్యా(Russia) మళ్లీ విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. శనివారం ఉదయం ఆ అటాక్ జరిగింది. ఆ దాడిలో 9 మంది మృతిచెందగా, 22 మంది గాయపడినట్లు తెలుస్తోంది. సోలోమియానస్కీ జిల్లాలో ఉన్న 5 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ దెబ్బతిన్నది. ఆ బిల్డింగ్‌లో ఉన్న 35 మంది తరలించారు. డర్నిస్టికి జిల్లాలో జరిగిన దాడి వల్ల ఏడు మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. అటాక్ వల్ల ఇండ్లు కూలి మంటలు వ్యాపించాయి. ఆ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్ సమీపంలో ఉన్న మిలిటరీ పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్‌లను టార్గెట్ చేసినట్లు రష్యా పేర్కొన్నది. డజన్ల సంఖ్యలో క్షిపణులను వదిలినట్లు రష్యా చెప్పింది. శుక్రవారం రాత్రి హై ప్రిసిషన్ గ్రౌండ్, సీ లాంచ్డ్ వెపన్స్, లాంగ్ రేంజ్ డ్రోన్లతో అటాక్ జరిగినట్లు రష్యా మిలిటరీ శాఖ పేర్కొన్నది. మిస్సైళ్లు, డ్రోన్లు, రేడార్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ ఉన్న ప్రొడక్షన్, స్టోరేజీ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు రష్యా చెప్పింది.