(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో గ్యాస్ సంక్షోభం తారస్థాయికి చేరింది. ముంబై నుంచి రాంచీ వరకూ.. చండీగఢ్ నుంచి బెంగళూరు వరకూ ఎక్కడ చూసినా ఎల్పీజీ సిలిండర్ కోసం ఏజెన్సీల ముందు వందలాది మంది బారులు తీరారు. ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడటంతో పలువురు అస్వస్థతకు గురవుతుండగా.. పంజాబ్‌లో ఏకంగా ఓ వృద్ధుడి ప్రాణాలే పోయాయి. అయితే, గ్యాస్ సంక్షోభం క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇవేమీ పట్టించుకోని కేంద్రం.. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ ఎప్పటిలాగే చెప్పుకొచ్చింది. గ్యాస్ కొరత కారణంగా పలు నగరాల్లో హోటళ్లు, మెస్‌లు, హాస్టళ్లు, పీజీలు మూతబడగా.. సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని భారీ రేట్లకు గ్యాస్ అమ్ముతూ దళారులు దండుకుంటున్నారు.
గ్యాస్ కోసం నిలబడి..
పంజాబ్‌లో బర్నాలా జిల్లాలోని సెహ్నా అనే గ్రామంలో ఘోరం జరిగింది. వంట గ్యాస్ కోసం గంటల తరబడి ఎండలో నిలబడిన 60 ఏండ్ల వృద్ధుడు ఒకరు కార్డియాక్ అరెస్ట్‌తో శుక్రవారం మరణించారు. బాధితుడిని భూషణ్ కుమార్‌గా గుర్తించారు.గడిచిన రెండురోజుల్లోనే ఎల్పీజీ బుకింగ్స్ మూడు రెట్లు పెరిగాయని, అయితే డిమాండ్‌కు తగినంత సరఫరా జరుగట్లేదని చండీగఢ్‌లోని ఓ ఏజెన్సీ నిర్వాహకుడు వాపోయాడు. మరోవైపు, గుజరాత్‌లోని వడోదరాలో గ్యాస్ కోసం క్యూలో నిలబడిన ఓ మహిళ.. ఎండ వేడిమి తాళలేక స్పృహకోల్పోయి పడిపోయింది. ఆమెను వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. బెంగాల్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
దేశమంతటా గ్యాస్ తంటా
ఒడిశాలో గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. జాజ్‌పూర్ టౌన్లో ఓ గ్యాస్ ఏజెన్సీ ‘నో స్టాక్ బోర్డు’ పెట్టి షాపును మూసేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్‌తో రోడ్డును దిగ్బంధించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇక, మహారాష్ట్రలోని నవీ ముంబై, నాగ్‌పూర్, పుణెలోని పలు ప్రాంతాల్లో ఖాళీ సిలిండర్లతో పౌరులు పెద్దయెత్తున గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలో నిలబడ్డారు. బీహార్ రాజధాని పాట్నాతో పాటు భాగల్పూర్, రోహ్తాస్, కాటిహార్ తదితర జిల్లాల్లోని గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో ప్రజలు క్యూలో నిలబడ్డారు. బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లోని గ్యాస్ ఏజెన్సీల ముందు పౌరులు పెద్దయెత్తున క్యూలోనే నిలబడ్డారు. అయితే, తగినంత గ్యాస్ సరఫరా లేకపోవడంతో తమకు సిలిండర్ దక్కడం లేదని పలువురు వాపోయారు.
హోటళ్లకు కష్టకాలం
తగినంత గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలు, పెద్ద ఇండక్షన్ స్టవ్‌లపై ఆహార పదార్థ్ధాలను వండటం ప్రారంభించాయి. ఏపీలోని విజయవాడలో ఎల్పీజీ కొరతతో 70 శాతం టిఫిన్ సెంటర్లు మూతబడ్డాయి. బఫే సర్వీసులను స్టార్ హోటల్స్ రద్దు చేశాయి. 60కి పైగా హోటల్స్ మూతబడ్డాయి. కర్ణాటకలోని బెంగళూరులో పరిమిత కాలంతో హోటల్స్ నడుస్తున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే భోజనాన్ని తెచ్చుకోవాలని, క్యాంటీన్ సర్వీసులు ఉండబోవని పలు టెక్ కంపెనీలు సర్క్యులర్లు జారీ చేశాయి. గ్యాస్ కొరతతో ముంబైలో 60 శాతం హోటల్స్ తాత్కలికంగా మూసేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కేరళలో 20 శాతం హోటల్స్ మూసేయగా, శనివారంనాటికి ఇది 40 శాతానికి చేరుకోవచ్చని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఖారా) తెలిపింది. వాణిజ్య సిలిండర్ సరఫరాలో తలెత్తిన సమస్యను వెంటనే పరిష్కరించాలని తమిళనాడులోని హోటళ్ల యజమానులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తల్ల‘ఢిల్లీ’
దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సంక్షోభం తీవ్రమైంది. తమ కమ్యూనిటీ కిచెన్‌లో భోజన సేవలు సవ్యంగా కొనసాగడం కోసం గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించాలని ఢిల్లీలోని ది ఢిల్లీ సిఖ్ గురుద్వారా కమిటీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు, గ్యాస్ కొరతతో ఢిల్లీలోని అటల్ క్యాంటీన్లపై భారం మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ కష్టంగా మారిందని నిర్వహకులు వాపోయారు. ఎల్పీజీ కొరతతో క్యాంటీన్లో భోజనాన్ని ఏర్పాటు చేయలేమని ఢిల్లీలోని కొన్ని స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజీలు పెట్టాయి. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు మెనూ ఐటెమ్స్‌ను భారీగా తగ్గించాయి. గ్యాస్ కొరతతో నగరంలోని దాదాపు 30 శాతం స్ట్రీట్ వెండర్స్‌కు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక, దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు మహిళలు భారీగా క్యూలో నిలబడటం కనిపించింది.
కోటాలోనూ కాక
ఎడ్యుకేషన్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాకూ గ్యాస్ సెగ తగిలింది. అక్కడి కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్, మెస్‌లకు గ్యాస్ కష్టాలు పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 4 వేల హాస్టల్స్, 500 మెస్‌లు మూతబడొచ్చని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.
హాస్పిటల్స్‌పై కూడా
ఎల్పీజీ కొరత హోటల్స్ పైనే కాకుండా హాస్పిటాలిటీ రంగంతో పాటు హాస్పిటల్స్ సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. గ్యాస్ కొరతతో కోల్‌కతాలోని పలు హాస్పిటల్స్‌లోని క్యాంటీన్లు మూతబడే పరిస్థితి తలెత్తింది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉన్నదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అతిథ్యంపైనా ప్రభావం
గోవాలోని పర్యాటక రంగంపై గ్యాస్ దెబ్బ భారీగా పడింది. విదేశీ అతిథులకు గతంలో మాదిరిగా మెనూలోని వంటకాలను అందించలేకపోతున్నామని పలు రెస్టారెంట్ నిర్వాహకులు వాపోయారు. గ్యాస్ కొరతతో కేరళలోనూ ఇలాంటి పరిస్థితులే దాపురించాయని ది కేరళ ట్రావెల్ మార్ట్ సొసైటీ (కేటీఎం) ఒక ప్రకటనలో తెలిపింది. అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది.
పేట్రేగిపోతున్న బ్లాక్ మార్కెట్ దందా
ఒకవైపు గ్యాస్ సంక్షోభం కొనసాగుతుండగా.. దీన్ని ఆసరాగా చేసుకొన్న కొందరు దళారులు భారీ రేట్లకు గ్యాస్ అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. బీహార్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ రూ.1,800, వాణిజ్య సిలిండర్‌ను రూ.4,000కు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక, భారీ క్యూలో నిలబడలేక సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందికరమైనప్పటికీ బ్లాక్‌లో సిలిండర్లను కొనే దుస్థితి వాటిల్లుతున్నది. బ్లాక్‌లో గ్యాస్‌ను అధిక రేట్లకు విక్రయిస్తున్న పలువురిని పలు రాష్ర్టాల్లో అరెస్ట్ చేశారు.
సంక్షోభాన్ని పట్టించుకోకుండా..
దేశంలో గ్యాస్ సంక్షోభం పట్టించుకోకుండా ఇక్కడి ఎల్పీజీని విదేశాలకు ఎక్కువ డబ్బులకు విక్రయిస్తుడటంపై మహారాష్ట్రలోని విదర్భకు చెందిన ఆరుగురు గ్యాస్ డీలర్లు బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంటూ గ్యాస్ నిల్వలు, సరఫరా సమాచారం ఇవ్వాలని కేంద్రం, సీపీఐఎల్కు నోటీసులు జారీ చేసింది.