Rayapole Farmers | రాయపోల్, ఫిబ్రవరి 07 : పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నా కాలువలో ఉన్న తుంగ, పూడికను ఎత్తివేయడాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులే రంగంలోకి దిగారు. రైతులంతా చేయి చేయి కలిపి పూడిక తీత పనులు షురూ చేసి స్ఫూర్తిగా నిలిచారు..
పెద్దగా సాగునీటి వనరులు లేని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుంది.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ప్రధాన కాలువలు, పలు ప్రాంతాల్లో ఉప కాలువల నిర్మాణం చేసుకొని గోదావరి జలాలు కూడా విడుదల చేసుకోవడం జరిగింది.. అయితే గత రెండేళ్లుగా కాలువల్లో పూడిక తీయకపోవడంతో తుంగ, పూడిక పేరుకపోయింది. దీంతో కాలువలో నీళ్లు వెళ్లడానికి అడ్డంకిగా మారడంతో కాలువలు తెగిపోతున్నాయి.. కాలువ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు..
యాసంగిలో కాలువ, చెరువు కుంటల ఆధారంగా పెద్ద ఎత్తున పంటలు సాగుచేశారు.. నేడు నీళ్లు అడుగంటడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొండపోచమ్మ ప్రాజెక్టులోని 13dకాలువకు సంబంధించిన మంతూర్, వెంకట్రావుపేట, లింగాపూర్, ఎల్ బంజేరు పల్లి, ముత్యంపేట, సూరంపల్లి, దొమ్మాట, గాజులపల్లి, జంగపల్లి, అల్మాజీపూర్ తదితర గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు సమావేశం నిర్వహించి ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కాలువ పూడిక తీయించి ఆదుకోవాలని వేడుకున్నారు. మంత్రి స్పందించకపోవడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు లాంగ్ భూమ్ ప్రోక్లైనర్ లు రెండు తెప్పించి మంతూర్-అనాజీపూర్ మధ్య కాలువ పనులు ప్రారంభించారు..
గత సంవత్సరం కూడా రైతులమే కాలువ పూడిక తీసి నీళ్లు తీసుకెళ్లామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన ఇళ్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా ఉన్న ప్రాజెక్టు కాలువకు పూడిక తీయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువ పూడికతీతకు నిధులు మంజూరు చేయాలని రైతులంతా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మంతూర్ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, ఉప సర్పంచ్ సంతోష్, దొమ్మాట మాజీ సర్పంచ్ పూజిత వెంకట్ రెడ్డి, గాజులపల్లి సర్పంచ్ స్వామి, తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

