రాయపోల్, సెప్టెంబర్ 18: నిత్యం వాహనాలు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గజ్వేల్- దౌల్తాబాద్ మార్గంలో నడిరోడ్డుపై గుంతలు ఏర్పడి ఏడాది గడుస్తున్నా పట్టించుకునే వారు కరువైపోయారని స్థానికులు వాపోతున్నారు. ప్రతి నిత్యం ఆ మార్గంలో వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. కానీ నడిరోడ్డులో గుంతలు ఏర్పడి, వర్షపు నీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా బైకులు అక్కడికి రాగానే బ్రేకులు వేయడంతో చాలామంది ఇప్పటికే కింద పడిపోయారు. ఆర్ అండ్ బీ రోడ్డు దుస్థితి ఈ విధంగా ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డును బాగు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని గతంలో మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతను పూడ్చివేయాలని కోరుతున్నారు.