Road Accident | అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గుబనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం కల్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను కర్ణాటకలోని ముదిగలకు చెందిన చంద్రకళ (32), ఆమె సోదరులు శివకుమార్ (36), హనుమంత రాయుడు (40)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.