పభుత్వం ప్రజల ఆస్తులతో ఆటలు ఆడుతున్నది. వారి భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మారుస్తున్నది. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తులను ఒక్కసారిగా నిషేధిత జాబితాలో చేర్చి.. రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. దీంతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారి బాధలు వర్ణనాతీతం. శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం తమ సొంత ఆస్తులు, ఇండ్లు, ప్లాట్లను అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆవేదనకు గురవుతున్నారు. 25, 30 ఏండ్ల కిందట ఎంతో కష్టపడి కొనుగోలు చేసుకొని ఇండ్లు కట్టుకున్న వారికి
ఇప్పుడు ఉన్నపళంగా ‘మీ ఇల్లు యూఎల్సీ పరిధిలో ఉంది.. రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు’ అని చెబుతుండటంతో నిర్ఘాంతపోతున్నారు.
మరోవైపు కొత్తగా ఒక్క గజం కూడా ఎలాంటి ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి చెప్పిన మాటలు పచ్చి అబద్ధమంటూ..బాధితులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నదని, ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ కావాలంటే ’యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్’ తీసుకురావాలని అధికారులు మెలిక పెడుతున్నారంటూ.. వాపోతున్నారు. గతంలో సజావుగా జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎందుకు కావడం లేదో సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. తక్షణం మంత్రి స్పందించి.. వాస్తవాలు తెలుసుకొని ప్రైవేటు ఆస్తులను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)
రెవెన్యూ యంత్రాంగం ప్యాలెస్‌లలో ఏసీ రూముల్లో కూర్చొని ఒక్క గజం భూమి కూడా కొత్తగా జాబితాలో చేర్చలేదని చెప్పడం అబద్ధమని, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటున్నదని బాధితులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ కోసం వెళుతున్న ప్రజలకు అధికారులు తీవ్ర నిరాశ మిగుల్చుతున్నారు. ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ కావాలంటే ’యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్’ తీసుకురావాలని మెలిక పెడుతున్నారు. 25, 30 ఏండ్ల కిందట ఎంతో కష్టపడి కొనుగోలు చేసుకుని ఇండ్లు కట్టుకున్న వారికి, ఇప్పుడు ఉన్నపళంగా ‘మీ ఇల్లు యూఎల్సీ పరిధిలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు’ అని చెప్పడంతో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడమే కాకుండా, కొత్తగా కొన్ని కాలనీలను ‘వక్ఫ్ భూములు’ అని ముద్రవేస్తూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములకు వెంటనే కాంపౌండ్ వాల్స్ నిర్మించి రక్షించకపోతే భవిష్యత్తులోనూ అధికారులు, నేతలు కలిసి అమ్ముకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారులను కూడా 6 నెలల్లోనే మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని, దీంతో వారు పదేపదే అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఏసీబీకి దొరికిన వారిని తక్షణమే డిస్మిస్ చేసి, 7 ఏండ్ల జైలు శిక్ష పడేలా కఠిన చట్టం తీసుకురావాలని, వారి ఆస్తులను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బడా రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు కలిసి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే, అమాయక పేద, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంతో తెలియక ఆ ప్లాట్లను కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. కబ్జాలు చేసిన అసలు దొంగలను వదిలేసి, ఆస్తులు కొనుగోలు చేసిన బాధితులను బలి చేయడం ఏమాత్రం న్యాయం కాదని రియల్ ఎస్టేట్ సంఘం నాయకులు మండిపడ్డారు. అక్రమంగా ప్రభుత్వ భూములు అమ్మి సొమ్ము చేసుకున్న వారిపై, అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన రాజకీయ నాయకులు, అధికారులను శిక్షించకుండా పేదలకు ఎందుకు శిక్ష అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్తగా నిషేధిత జాబితాలో ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను చేర్చలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ,గతంలో అయిన రిజిస్టేషన్లు ఇప్పడు ఎందుకు కావడం లేదని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ విమర్శించింది. ‘ఎన్నికల ముందు ఓటర్ల ఇంటి ముందుకు వచ్చి పొర్లు దండాలు పెట్టినా, ముక్కు నేలకు రాసినా.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌లో ప్రజల చేతిలో భంగపాటు తప్పద’ని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఒక్క గజం సైతం నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి ఏసీ రూంలో కూర్చోని మాట్లాడటం పచ్చి అబద్ధమన్నారు. తక్షణం రాష్ట్ర మంత్రి స్పందించి.. వాస్తవాలు తెలుసుకొని.. ప్రైవేటు ఆస్తులను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలన్నారు.
– తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్