న్యూఢిల్లీ : స్వాడ్రన్ లీడర్ భావనకాంత్ మరో అరుదైన ఘనత సాధించారు. భారత వైమానిక దళంలోనే అత్యంత కఠినమైన ఫైటర్ కంబాట్ లీడర్ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఫైటర్ పైలట్‌కు ఇదే అత్యున్నత బ్యాడ్జ్. గ్వాలియర్‌లో ఐదు నెలల పాటు సాగే ఈ కోర్సుకు ఐఏఎఫ్ వైమానిక సిబ్బందిలో వందలో ఒకరు మాత్రమే ఎంపికవుతారు. ఈ కోర్సుకు ఎంపికైన వారికి అధునాతన వైమానిక పోరాట వ్యూహాలలో శిక్షణ ఇచ్చి.. వారిని ఫ్రంట్‌లైన్ స్వాడ్రన్లు ఎలా పోరాడాలనే దానిపై కఠినమైన శిక్షణ ఇస్తారు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆయుధాల వాడకంపై అధికారం కలుగుతుంది. భావన తన పదేండ్ల వైమానికదళ అనుభవంలో ఉన్నత స్థాయికి చేరుకుందని ఆయా వర్గాలు తెలిపాయి. 2016లో భావన, అవని చతుర్వేది, మోహన సింగ్ తొలి మహిళా ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లుగా చేరారు. అప్పటి నుంచి భావన వరుసగా ప్రమోషన్లు పొందుతూ ఈ స్థాయిదాకా చేరుకున్నారు.