సంగారెడ్డి, జూలై 23(నమస్తే తెలంగాణ) : కేంద్రం బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి దక్కింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.ఈ బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించినా కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రజలు మోడీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు పెద్దగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎలాంటి భారీ నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా కొత్త రైల్వేలైన్లు, రైల్వేలైన్ల ఆధునీకరణకు నిధులు కేటాయిస్తారని ప్రజలు ఆశించారు. వట్టినాగులపల్లి-జోగిపేట-మెదక్ నూతన రైల్వేలైన్ కోసం జిల్లా ప్రజలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఈ బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైట్ విస్తరణ చేపట్టాలనే డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైల్ విస్తరణ చేపడతామని ఇది వరకే ప్రకటించింది.
మెట్రోరైల్‌ను సంగారెడ్డి వరకు పొడిగించాలని సంగారెడ్డి ప్రాంత ప్రజల డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో మెట్రోను సంగారెడ్డి వరకు విస్తరించాలని కోరుకుంటున్నారు. ఇటీవల బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన రఘునందన్‌రావు సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణకు హామీ ఇచ్చారు. కానీ, కేంద్రం మెట్రో విస్తరణ ఊసెత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 110 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ, నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు.
సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ చేయాలని, జహీరాబాద్‌లో రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయింపులు జరపలేదు. మెదక్ జిల్లాలోని అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారం రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని ప్రజలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు ఎక్స్ట్రీమ్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు(ఈఏపీ) కింద కేంద్రం రూ. 122 కోట్ల నిధులను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.522 కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర,ఈసారి రూ.122 కోట్లతో సరిపెట్టింది.
పేదల వ్యతిరేక బడ్జెట్
సిద్దిపేట జూలై 23: పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలు, మధ్యతరగతి ప్రజలపై భారం వేసి కార్పొరేట్ శక్తులను సంతృప్తిపర్చేవిధంగా ఉన్నది. ఇది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రజాసమస్యలను పకకు పెట్టి కేవలం కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం తగదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆహార భద్రతకు గ్యారెంటీ కల్పించలేదు. ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన రూ. 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలి. ప్రజా అనుకూల బడ్జెట్‌ను రూపొందించాలి.
-ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి, సిద్దిపేట జిల్లా
ఉద్యోగ వర్గాలకు లాభం లేదు
మెదక్ మున్సిపాలిటీ, జూలై 23: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు లాభంలేదు. ఇన్‌కమ్‌ట్యాక్స్ పాత విధానంలో మార్పు చేయకపోవడం నిరాశపర్చింది. మధ్యతరగతి, వేతన జీవులకు సైతం పెద్దగా లాభం చేకూర్చే విధంగా లేదు. ఇంతకు ముందు రూ. 2.50 లక్షల వరకు జీరో పన్ను ఉండేది. కానీ కొత్త ఐటీ విధానంలో రూ.3 లక్షల వరకు ఉండటం, స్టాండర్డ్ డీడక్షన్ రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పెంచడం కొంత మేరకు ఊరట కలిగిందని చెప్పవచ్చు.
-మల్లారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, మెదక్ జిల్లా
ఉద్యోగులకు తీవ్ర నిరాశే
సిద్దిపేట, జూలై 23 : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. పదేండ్ల నుంచి ఆదాయ పన్ను పరిమితి పెంచకపోవడం, దీనికి తోడు కొత్త , పాత పన్ను విధానం తీసుకువచ్చి ఉద్యోగులను పూర్తి డైలామాలో పడేశారు. కేంద్రం కేవలం ఉద్యోగుల నుంచి పన్ను వసూలు చేయాలనే ఏకైక లక్ష్యం తో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉద్యోగుల పట్ల కేంద్రం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదాయ పన్ను స్లాబ్‌లు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు వినతి పత్రం అందించినా ప్రయోజనం లేదు.
-కోమండ్ల విక్రంరెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి, సిద్దిపేట జిల్లా
తెలంగాణపై కేంద్రం వివక్ష
గజ్వేల్, జూలై 23 : కేంద్రం కేటాయించిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష చూపింది. ఉపాధి హామీ పథకానికి తక్కువ నిధుల కేటాయింపు బాధాకరం. కేంద్రం కేటాయించిన బడ్జెట్లో గతంతో పోల్చితే రూ.19,300కోట్లు తక్కువగా కేటాయించారు. గత సంవత్సరం కంటే మొదటి మూడు నెలల్లోనే రూ.5.74 కోట్ల పనిదినాలు జరిగాయి. పనిదినాల ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం కూలీల పొట్టకొట్టడమే. రూ.48 లక్షల 21వేల కోట్లతో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. బడ్జెట్లో ఏపీ, బీహార్ మినహాహిస్తే మిగతా 26 రాష్ర్టాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తగదు. -దాసరి ఎగొండస్వామి,డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
కేంద్ర బడ్జెట్‌లా లేదు
సిద్దిపేట టౌన్, జూలై 23 : పార్లమెంట్లో కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేం ద్ర బడ్జెట్‌లా లేదు. బీహార్, ఏపీ రాష్ర్టాలకు ప్రయోజనం చేకూరేలా రూపొందించినట్లుగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు సాధించింది. బీజేపీ కేంద్ర మంత్రులు,ఎంపీలు ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకురాలేదు. పునర్విభజన చట్టంలో రెండు రాష్ర్టాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్పష్టంగా ఉన్నా బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకుం డా ఆంధ్రరాష్ర్టానికి నిధులు కేటాయించడం బాధాకరం.
– కాంత్రికుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేట
తెలంగాణకు తీరని అన్యాయం
చేర్యాల, జూలై 23 : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యా యం జరిగింది. బహుపాక్షిక అభివృద్ధి ఏజన్సీల ద్వారా బీహార్‌కు ఆర్థికసాయం, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం చేస్తున్నట్లు ప్రకటించి తెలంగాణకు కనీసం ఒక్క ఐఐఎం కేటాయించకపోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వ అలయన్స్‌లో ఉన్నారు కాబట్టే బీహార్, ఏపీకి సాయం చేస్తే ఇది దేశానికే ప్రమాదం. మన రాజకీయ వ్యవస్థలోనే లోపా లు ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఇదే పద్ధతి కొనసాగించడం సరికాదు. దేశంలోని అన్ని ప్రాం తాలు అభివృద్ధి సాధించేలా బడ్జెట్ ఉండాలి.
-ఆలేటి రమేశ్, విద్యార్థి నాయకుడు,చేర్యాల, సిద్దిపేట జిల్లా
తెలంగాణపై చిన్నచూపు
సంగారెడ్డి, జూలై 23 : పార్లమెంట్లో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. పదేండ్ల క్రితం విభజన అయిన కొత్త రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాల్సిన కేంద్రం పట్టించుకోలేదు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే బీజేపీ కేంద్ర మంత్రులు కాలం గడిపారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ఎందుకూ పనికిరాకుండా పోయారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రస్తావన లేకపోవడం బాధాకరం.
-చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే
బీజేపీకి చిత్తశుద్ధిలేదు
నర్సాపూర్,జూలై 23: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దారుణం. సెంటిమెంట్‌తో ఓట్లు పొందిన బీజేపీకి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. సీట్లు, ఓట్లు తప్పా బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ప్రేమ లేదు. కులం, మతం, దేవుడి పేరుతో చేసిన రాజకీయాలు బీజేపీకి చెల్లుతాయి. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అధిక నిధులు కేటాయించేవిధంగా పోరాటం చేస్తారు.
-ఆంజనేయులుగౌడ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
మొండి చేయి చూపడం బాధాకరం
తొగుట, జూలై 23: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రధాని మోదీ స ర్కారు మొండి చేయి చూపడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలోని వెనుకబడిన తొమ్మిది జిల్లాలకు ఎలాం టి కేటాయింపులు చేయలేదు. బయ్యారం ఉక్కు గనులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ఊసే లేదు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు అధిక నిధుల కోసం పోరాటం చేయాలి. మొదటి నుంచి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్నది.
-జీడిపల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ తొగుట అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా