సిద్దిపేట, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ అభాసుపాలవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు రెండోరోజూ శుక్రవారం తిప్పలు తప్పలేదు. దరఖాస్తు ఫారం నింపడంలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ, వాటిని నివృత్తి చేయడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. దళారుల చేతిలోకి దరఖాస్తు ఫారాలు వెళ్తున్నాయి. దీంతో ఒక్కో ఫారాన్ని రూ.50 నుంచి రూ.100కు అమ్ముకుంటున్నారు. రైతు భరోసాకు స్పష్టత కరువైంది. తమకు భూమి ఉన్న చోటే ఫారమ్ నింపి ఇవ్వాలా..? ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడికి వెళ్లి ఇవ్వాలా అనే విషయంలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆయా సెంటర్ల వద్ద ప్రజలు తిండీతిప్పలు మాని పడిగాపులు కాస్తున్నారు. ఇదంతా కాలయాపన కోసమే చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అభాసుపాలవుతున్నది. ప్రభుత్వం చెప్పిన విధంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. శుక్రవారం రెండో రోజూ ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మొదటి రోజు జరిగిన లోటు పాట్లను సరిచేసుకుని రెండో రోజైనా ప్రజాపాలనను సరిగ్గా నిర్వహిస్తారనుకుంటే అది జరగలేదు. దరఖాస్తు ఫారం నింపడంలో ప్రజలకు అనేక సందేహాలున్నప్పటికీ, వాటిని నివృత్తి చేయడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కౌంటర్ల వద్ద సరిపడా దరఖాస్తు ఫారాలు లేవు. గ్రామసభల్లోనైనా దరఖాస్తు ఫారాలు ఉన్నాయా అంటే అవి కూడా లేవని చెబుతున్నారు. ఏ గ్రామసభకు వెళ్లినా దరఖాస్తు ఫారాల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది.
దళారుల చేతికి దరఖాస్తు ఫారాలు
గ్రామసభకు ముందే కొంతమంది దళారుల చేతిలోకి దరఖాస్తు ఫారాలు వెళ్తున్నాయి. వాటిని వారి అనుయాయులకు ఇవ్వడంతో పాటు కొన్ని జిరాక్స్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో పెట్టి ఒక్కో దరఖాస్తు ఫారాన్ని రూ.50 నుంచి రూ.100కు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నారు. అర్జీదారులు జిరాక్స్ ఫారాల్లో తమ కుటుంబ వివరాలు నింపి ఇస్తే, చాలా చోట్ల అధికారులు వాటిని సీకరించడంలేదు. తాము ఇచ్చిన దరఖాస్తు ఫారాల్లోనే నింపి ఇవ్వాలని చెబుతున్నారు. ప్రజలకు సరిపడా దరఖాస్తు ఫారాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు నిలదీస్తే అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రతి దరఖాస్తు ఫారానికి కుటుంబ యజమాని ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు జిరాక్స్ కాపీలు జత చేయాల్సి రావడంతో ఆ కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు.
ఆధార్ అప్డేట్ కోసం అవస్థలు
దరఖాస్తు ఫారమ్‌కు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేయాల్సి రావడంతో ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాత్రిళ్లు కూడా అక్కడే పడుకొంటున్నారు. తిండి తిప్పలు మాని ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యుత్ అధికారులు ప్రజాపాలన కౌంటర్లలోనే కరెంట్ బిల్లులు వసూలు చేసి, రసీదు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసానిపల్లిలో కరెంట్ బిల్లులు ప్రజాపాలన కౌంటర్ వద్దే వసూలుచేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. దరఖాస్తు ఫారాలే ఇవ్వలేని సర్కారు ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.
రైతు భరోసాపై స్పష్టత కరువు
రైతు భరోసాకు ఒక కుటుంటం ఒక దరఖాస్తు ఫారమ్ ఇవ్వాలా..? ఆ కుటుంబంలో వేర్వేరుగా ఉన్న భూమి వివరాలకు మరో ఫారమ్ ఇవ్వాలా అనే విషయంలో స్పష్టతలేదు. ఒక కుటుంబానికి ఇతర గ్రామాల్లో భూములు ఉన్నప్పడు తాను ఉన్న చోటే ఫారమ్ నింపి ఇవ్వాలా..? ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడికి వెళ్లి ఇవ్వాలా అని గ్రామ సభల్లో కొంతమంది రైతులు అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అధికారుల వద్ద సరైన సమాధానాలు లేవు. ప్రజల సందేహాలకు సమాధానాలు లేని ఈ ప్రజాపాలన ఎందుకో.. కేవలం ఇదంతా కాలయాపన కోసమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. హత్నూరలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆర్డీవో రవీందర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, మండల ప్రత్యేకాధికారి, జడ్పీ డిప్యూటీ సీఈవో స్వప్న ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అధికారులతో వాగ్వాదం
హత్నూరలో దరఖాస్తు ఫారాలు అందజేయకపోవడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు మానుకొని దరఖాస్తు చేసుకోవడం కోసం వస్తే ఫారాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఎంపీడీవో శారదాదేవి కల్పించుకుని అందరికీ దరఖాస్తు ఫారాలు అందజేస్తామన్నారు.
అర్హులు ఎవరో స్పష్టత లేదు ; అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీలన్నీ ఆగమాగమేనని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులోని సాయి గార్డెన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తుందని, గ్రామాల్లో పెడుతున్న గ్రామసభలతో ప్రజలు తీవ్ర గందరగోళంలో పడ్డారన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే ప్రజాపాలన పేరుతో కొత్త నాటకం ఆడుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలనను చూసి ప్రజలు ఎవ్వరు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయికుమార్, శివశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మంతురి శశికుమార్, ఆయా గ్రామాల సర్పంచులు నారాయణ, రమేశ్, శ్రీనివాస్, మల్లేశం, రాయికోడ్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నారాయణ, డైరెక్టర్లు శ్రీనివాస్, చెన్నవీరయ్యస్వామి, యువత విభాగం మండల అధ్యక్షుడు ఆనంద్‌రావు, మైనార్టీ అధ్యక్షుడు మౌలనా, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అన్ని వసతులు కల్పించాలి
ప్రజాపాలన కార్యకమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రజాపాలన నోడల్ అధికారిణి సంగీత సూచించారు. మండలంలోని పులిమామిడిలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, మండల ప్రత్యేకాధికారి జంలానాయక్, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ గియనిస్సాబేగం, ఈపీఎం లక్ష్మీ నర్సమ్మ పాల్గొన్నారు. నార్సింగి మండలం నర్సంపల్లిలో ఎంపీపీ చిందం సబిత, ఈవో యాదగిరి, నర్సంపల్లి సర్పంచ్ బొమ్మగారి భారతి, కిషన్ తదితరులు హాజరయ్యారు.
చాలా డౌట్లు వస్తున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం తీసుకుంటున్న దరఖాస్తు ఫారాల్లో వివరాలు నింపుతుంటే చాలా డౌట్లు వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద (రూ. 2500) ఎవరు అర్హులు అని చెప్పలేదు.. విద్యుత్ బిల్లు 200 యూనిట్లలోపు ఉచితం కోసం ఇంటి యజమాని పేరు మీద ఉన్న మీటరు నంబర్ వేస్తే మాకు ఎట్లా మేలు కలుగుతది. మేము అద్దెకు ఉంటున్నాం. దరఖాస్తు ఫారంలో ఎవరి కరెంట్ మీటర్ నంబర్ వేయాలో తెలియడం లేదు. ఇట్లా అనేక డౌట్లు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని నివృత్తి చేయాలి. అధికారులను అడిగితే క్లారిటీ లేదంటున్నారు. ఎట్లా దరఖాస్తు ఫారం నింపాలో అర్థంకావడం లేదు. గ్యాస్ సిలిండర్లు ఎన్ని వాడుతున్నట్లు అడిగారు. ఎన్ని వాడితే రూ.500 పథకం వర్తిస్తుందో అందులో వివరంగా చెప్పలేదు.
– లావణ్య, సిద్దిపేట
ఉదయం వచ్చిన.. దరఖాస్తు పత్రాలివ్వడం లేదు
మాది జహీరాబాద్ పట్టణంలోని 6 వార్డు.. ఉపాధి కోసం సంగారెడ్డిలో ఉంటున్నా. ఉదయం ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తున్నారని తెలుసుకొని సంగారెడ్డి నుంచి వచ్చిన. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది ఎవరూ దరఖాస్తు పత్రాలు ఇవ్వలేదు. దరఖాస్తు పత్రాలు ఇవ్వాలని కోరితే అధికారులు ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రతిఒక్కరికీ దరఖాస్తులు ఇస్తామని ప్రభుత్వం తెలుపుతున్నా ఇక్కడ సిబ్బంది దరఖాస్తు పత్రాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి దరఖాస్తులు ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కౌంటర్ వద్ద సిబ్బంది కావాల్సిన వారికి దరఖాస్తు పత్రాలు ఇస్తున్నారు.
– శ్రీధర్, సంగారెడ్డి పట్టణం
ముందే అవగాహన కల్పిస్తే బాగుండేది
మాకు ఇటీవల పెండ్లయింది. కొత్తరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే నా ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాలని అధికారులు అన్నారు. మీ సేవా సెంటర్ల వద్ద ప్రజల రద్దీ విపరీతంగా ఉంది. ప్రజాపాలన దరఖాస్తు ఫారం గురించి పది రోజుల ముందే అవగాహన కల్పిస్తే బాగుంటుండె. ఇప్పుడు అన్నీ ఒకేసారి కావాలంటే ఇబ్బంది అవుతుంది.
– బేగరి స్రవంతి, గృహిణి, గూడూరు, శివ్వంపేట మండలం
ఎవరిని అడిగినా.. దరఖాస్తులు ఇవ్వడం లేదు..
జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్ వద్ద దరఖాస్తు పత్రాలు ఇస్తున్నారని తెలుసుకొని ఉదయం వచ్చినం. దరఖాస్తు పత్రాలు ఇవ్వాలని సిబ్బందిని కోరినా ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. అధికారులు కొన్ని దరఖాస్తు పత్రాలను ఉదయం ప్రజలకు ఇచ్చారు.. తర్వాత అడిగితే అయిపోయాయి. వచ్చిన తర్వాత ఇస్తామని చెబుతున్నరు. పని మానుకొని ఉదయం కౌంటర్ వద్దకు వచ్చినా దరఖాస్తు పత్రాలు ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేరు. సిబ్బంది ఉన్నా వారు సరైన సమాధానం ఇవ్వడం లేదు. సాయంత్రం వరకు ఉన్నా అధికారులు పత్రాలు ఇవ్వలేదు. రేపు చూస్తామని సమాధానం ఇస్తున్నారు.
– విజయ్‌లక్ష్మి, రాచన్నపేట, జహీరాబాద్