సంగారెడ్డి, జూన్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్‌ను బడుల ప్రారంభం నాటికి అందించాల్సి ఉంది. బీఆర్ఎస్ హయాంలో అలాగే అందించారు. కానీ, కాంగ్రెస్ ప్రభు త్వ తీరుతో సంగారెడ్డిలో జిల్లాలో ఈసారి కేవలం జత స్కూల్ యూనిఫామ్ మాత్రమే సిద్ధమయ్యాయి. సిద్ధమైన యూనిఫామ్స్ బడులకు పంపించారు. వాటి పంపిణీ ప్రస్తు తం జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో 1070 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరికోసం ఒక జతకు 2,48,442.63 మీటర్ల క్లాత్ జిల్లాకు రావడంతో అధికారులు మహి ళా సంఘాల సభ్యులతో యూనిఫామ్స్ కుట్టించారు. ఇటీవల రెండో జతకు సంబంధించి క్లాత్ రావడంతో యూనిఫామ్‌లు తయారు కాలేదు. త్వరలోనే విద్యార్థులకు రెండో జతను అందిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.జత యూనిఫామ్ కుట్టేందుకు రూ.75 చొప్పున మహిళా సంఘాల సభ్యులకు డీఆర్డీవో అధికారులు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులు వారికి పెద్దగా గిట్టుబాటు కావడం లేదని తెలిసింది. గత బుధవారం న్యాల్కల్ మండలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కేవలం ఒకే జత యూనిఫామ్‌తో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ ముగిసిన తర్వాత ఆ యూనిఫామ్‌ను మళ్లీ ఉతికి మరునాడు ధరించి స్కూల్‌కు వస్తున్నారు.
గతంలో ఏజెన్సీలతో తయారీ..
బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు ఒక ఏజెన్సీతో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ ముందే కుట్టించే బడుల ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో అందించారు. ఒకేసారి ఒక ఏజెన్సీ యూనిఫామ్స్ తయారు చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో మండలాల వారీగా సబ్ ఏజెన్సీలతో కుట్టించి సకాలంలో అందించారు. ఈసారి విద్యార్థుల యూనిఫామ్‌ల తయారీకి ప్రభుత్వం నుంచి క్లాత్(బట్ట) రావడం ఆలస్యం కావడం, మహిళా సంఘాల సభ్యులతో కుట్టించడంతో జాప్యం జరిగిందని అధికారుల తెలిపారు. ఒక జతకు రూ.75 చొప్పున కుట్టు కూలి ఇస్తుండడంతో వారికి గిట్టబాటు కాక కొంత ఆలస్యం జరిగినట్లు సమాచారం. వచ్చే నెలలో విద్యార్థులకు రెండో జత ఇచ్చే అవకాశం ఉంది.
రెండో జత యూనిఫాంకు బట్ట రావాలి
జిల్లాలో 1070 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 85వేలకు పైగా విద్యార్థులు ఒకే జత యూనిఫామ్‌కు సరిపడా ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చింది. దీంతో బడుల ప్రారంభం నాటికి విద్యార్థికి ఒక జత యూనిఫాం అందించేందుకు కుట్టించాం. జిల్లాలో 76 మహిళా సంఘాల సభ్యులతో డీఆర్డీవో ఆధ్వర్యంలో యూనిఫాం కుట్టే కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఒక్కో కేంద్రంలో సుమారు 15 మంది మహిళల వరకు కుడుతున్నారు. రెండో జతకు క్లాత్ రాగానే జిల్లాలోని వంద వసతిగృహాలు, కేజీబీవీ విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లు పంపిణీ చేస్తాం.
– జంగారెడ్డి, డీఆర్డీవో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్, సంగారెడ్డి