Roads Damage | రాయపోల్, అక్టోబర్ 04 : గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అద్వానంగా మారడంతో రోడ్డుపై నడవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సి వస్తుంది. ఆర్అండ్బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్లపై ఏర్పడ్డ గుంతలపై కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అడుగడుగునా గుంతలు ఏర్పడి రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే వడ్డేపల్లి నుంచి నాచారం వరకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు అడుగడుగునా గుంతలు ఏర్పడి ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
నిధులు మంజూరు చేసినా..
గుంతలు చూసి మరో మార్గాన ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రయాణికులు, ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరు చేసినా ఇంతవరకు మరమ్మతు పనులు ప్రారంభించలేకపోవడం అధికారుల పనితీరు అద్దం పడుతోంది. ఈ రోడ్డు మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గజ్వేల్-అంకిరెడ్డిపల్లి రహదారి నుండి వీరానగర్ వరకు రోడ్డు అద్వానంగా మారింది.
అడుగు అడుగునా గుంతలు ఏర్పడి ప్రజలు ప్రయాణికులు హరిగోస పడుతున్నారు. ఈ రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేయాలని అధికారులకు, నాయకులకు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయిందని వీరనగర్ గ్రామస్తులు వాపోతున్నారు. రాయపోల్ పెద్దమ్మ గుడి నుంచి తిరుమలాపూర్ వరకు చిన్నపాటి వర్షానికి రోడ్డంతా చిత్తడిగా మారిపోవడానికి ప్రయాణికులు, వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతుకు నిధులు కేటాయించాలని ఆయా గ్రామాల ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
HYDRAA | రేవంత్ రెడ్డి పక్కా దొంగనే.. నిప్పులు చెరిగిన హైడ్రా బాధితురాలు
Man Shoots Friend | ఫ్రెండ్ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్