Monalisa | ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యువతి మోనాలిసా భోస్లే ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వివాహంపై కొందరు ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణలు చేయడంతో వివాదం మరింత తీవ్రంగా మారింది. ముఖ్యంగా మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాహం ప్రేమతో జరిగినది కాదని, ఇది ‘‘లవ్ జిహాద్’’లో భాగమని ఆయన ఆరోపించారు. మోనాలిసాకి తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకువచ్చానని, ఆమె జీవితాన్ని మార్చేందుకు ఎంతో కృషి చేశానని తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా నిరాశకు గురిచేశాయని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన నేపథ్యంలో మోనాలిసా మీడియా సమావేశం నిర్వహించి స్పందించింది. తన వివాహంపై వస్తున్న ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించింది. “మేము హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ లవ్ జిహాద్ కాదు” అని స్పష్టం చేసింది. ఈ వివాహం పూర్తిగా తన స్వంత నిర్ణయంతో జరిగిందని, తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని ప్రయత్నించారని, అయితే అది తనకు ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధాన్ని తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇదే విషయంపై ఫర్మాన్ ఖాన్ కూడా స్పందించాడు. మేమిద్దరం మా మతాలను మార్చుకోలేదు. ప్రేమలో మతం మారాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయం అని ఆయన తెలిపారు.
అయితే ఈ వివాహంపై మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే కూడా సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె ‘ లవ్ జిహాద్’కు గురైందని ఆయన ఆరోపిస్తూ, మోసపూరితంగా ప్రేమలో పడేసి వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, తన కుమార్తెను సురక్షితంగా తిరిగి మధ్యప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తన కుమార్తె జీవితాన్ని మోసం చేసి దెబ్బతీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇక మోనాలిసా కుటుంబం సంచార ‘పార్ధి’ కమ్యూనిటీకి చెందినదని, ఆ సమాజంలో ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన నియమాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ సంప్రదాయాల ప్రకారం ప్రేమ వివాహం చేసుకున్న కుటుంబాలను సమాజం నుంచి వెలివేసే పరిస్థితి ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.మరోవైపు హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు కూడా మోనాలిసా తిరిగి ఇంటికి వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసా వివాహం చుట్టూ నెలకొన్న ఈ వివాదం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.