Multipurpose Workers | రాయపోల్, మార్చి 15 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఆదివారం మల్టీపర్పస్ వర్కర్లకు పిపి కిట్లను అందజేశారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిలుముల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఎంపీఓ శివకుమార్ తదితరుల ఆధ్వర్యంలో మల్టీపర్పస్ వర్కర్లకు పీపీ కిట్లతోపాటు వారికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో పారిశుధ్యంపై దృష్టి పెట్టి వీధులను పరిశుభ్రం చేస్తున్న మల్టీపర్పస్ కార్మికుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్న మల్టీపర్పస్ కార్మికులకు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో ప్రతీ వీధుల్లో తిరుగుతూ ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారాన్ని తీసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర ఎంతో ఉంటుందన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మల్టీపర్పస్ వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు.
కాగా మండలంలోని అనాజీపూర్, టెంకంపేట, కొత్తపల్లి, సయ్యద్ నగర్, అంకిరెడ్డిపల్లి, రాయపోల్ మొదలగు గ్రామాల నుంచి వచ్చిన మల్టీపర్పస్ వర్కర్లకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు మండల ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

