రాయపోల్.మే05 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని, జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రులకు సమన్వయం లేక రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం రాయపోల్ మండలం రామారం, దౌల్తాబాద్ మండలం హిందు ప్రియాల్ గ్రామాల్లో వడగండ్ల వానలతో నష్ట పోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా రైతాంగం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాహసిల్దార్ కార్యాలయం నుంచి ఏ ఒక్క అధికారి కూడా గ్రామాల్లోకి వెళ్లి పంట నష్టపరిహారం సేకరించడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు.
ప్రభుత్వ పథకాలపై ఫోకస్ పెడుతున్న జిల్లా యంత్రాంగం రైతులకు జరిగిన నష్టం పై ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ భూభారతి పేరు చెప్తున్నాడని, కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి పేరుతో అధికారులు కాలయాపన చేయడం తగదన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్నప్పటికీ కనీసం మండల అధికారులు రాకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని, తాము రాజకీయాలు చేయడం లేదన్నారు.. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అయినప్పటికీ అధికారులు ఉదాసీన వైఖరి అవరంభించడం సరైనది కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుందని దుబ్బాక నియోజకవర్గం లో ప్రభుత్వ కార్యాలయంలో చాలా అవినీతి పెరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ. మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు రాజు రెడ్డి, దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ రహీముద్దీన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.