తొగుట, ఏప్రిల్ 02 : ఓవర్ లోడ్ మూలంగా ట్రాన్స్ ఫార్మర్ ట్రిప్ కావడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలియగానే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పంధించడంతో వారి కరెంటు గోస తీరింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకర్రావుపేటలోని వడ్డెన కాలనీకి సమీపంలో మక్కల మహేష్, శ్రీనివాస్, ఈదుగల్ల బిక్షపతి, అంజనేయులులు బోరుమోటర్ల ఆధారంగా వరి సాగు చేశారు. వీరు వినియోగిస్తున్న 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ తరుచూ ట్రిఫ్ కావడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
వారు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామిగౌడ్ ల దృష్టికి తీసుకెల్లడంతో వారు వెంటనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యుత్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి కొత్తగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు బుధవారం సాయంత్రం 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో 63కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీంతో వారి విద్యుత్ సమస్య తీరిపోయింది. తమ గోడు ఆలకించి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.