సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. పేద పిల్లలకు ఆకలి లేకుండా విద్యాభ్యాసం చేయించాలనే లక్ష్యం నీరుగారుతున్నది. కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలల్లో అస్తవ్యస్తంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు రాజన్నగొల్లపల్లి, రామన్నపేట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం బంద్ అయింది. దీంతో పిల్లలు ఇంటి నుంచే క్యారేజీ తెచ్చుకోవాల్సి వస్తుండగా, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు.
కోనరావుపేట, జూలై 31 : కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు కొనసాగుతున్నది. పేద పిల్లలకు మధ్యాహ్నం వేళ విద్యార్థులకు భోజనం అందించి, హాజరుశాతం పెంచాలనే లక్ష్యంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం చూపుతున్నది. దీంతో చిన్నారులు బడిమానేయాల్సిన దుస్థితి నెలకొంటున్నది. అందుకు కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాజన్నగొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు ఉండగా, మధ్యాహ్న భోజనం లేకపోవడం తదితర కారణాలతో ఐదుగురు ప్రైవేట్‌కు వెళ్లిపోయారు. ఉన్న మిగతా ఇద్దరు పిల్లలు కూడా ఇంటి నుంచే క్యారేజీలు తెచ్చుకుని భోజనం చేస్తున్నారు. శుక్రవారం ఆ ఇద్దరూ గైర్హాజరు కావడంతో పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒకరే ఉన్నారు. రామన్నపేటలోనూ అలాంటి పరిస్థితే ఉన్నది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించడం లేదు. శుక్రవారం సర్పంచ్, హెచ్ఎం చొరవతో తాతాలికంగా వంట ఏర్పాటు చేసినా.. నాణ్యతలేని పులిహోర వడ్డించడంతో పలువురు విద్యార్థులు ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనమే తిన్నారు. అయితే వంట నిర్వాహకులు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు చేతులు దులుపుకొంటున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. వంట మనుషులు లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎకువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరిస్థితి ఉండడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోతో కూడిన కమిటీ మధ్యాహ్న భోజన నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉన్నా.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని, పాఠశాలలు ప్రారంభమై నెలన్నర గడిచినా కనీసం పరిస్థితిని సమీక్షించడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రత్యేక దృష్టి సారించి వెంటనే మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో మురళీనాయక్‌ను వివరణ కోరగా.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, పలుసార్లు గ్రామస్తులతో మాట్లాడినా గిట్టుబాటు కాదని వారు నిరాకరించారని చెప్పారు. వారు రాకపోతే మేం వంట చేసి పెట్టలేం కదా? అన్నారు. ఈ సమస్యను ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.