– విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది గురువులే
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– నల్లగొండలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
– పాల్గొన్న ఎమ్మెల్సీలు, కలెక్టర్, ఎస్పీ, మేయర్
రామగిరి, సెప్టెంబర్ 22 : విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది గురువులేనని, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ – 2026 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా స్ధాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 189 మంది జిహెచ్ఎం, ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నమోదు తగ్గినప్పటికీ నల్లగొండ జిల్లాలో 9 శాతం పెరగడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారనే అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం, జీవిత లక్ష్యాలు, విలువలను నేర్పించాలని సూచించారు. పదో తరగతి అనంతరం ఇంటర్లో విద్యార్థుల వైఫల్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మధ్యలో బడి మానేసే విద్యార్థుల వివరాలను సేకరించి కారణాలను విశ్లేషించాలని కోరారు.

‘సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది’
ఉపాద్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాద్యాయుల పనితీరును ప్రశించారు. విద్యార్థుల జీవితాలకు విద్య వెలుగునిస్తుందని, ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ నవ సమాజ స్దాపనలో నేటి విద్యార్దులను తయారు చేయడంలో ఉపాద్యాయుల సేవలు చిరస్మరనీయమని కీర్తించారు. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. డీఈఓ సుసింధర్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో విద్యార్థుల నమోదు 9 శాతం పెరిగిందని, ఉపాధ్యాయులు పాఠశాల సమయానికి అదనంగా రోజుకు సుమారు గంటన్నర పని చేస్తున్నట్లు తెలిపారు.

‘సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది’
జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వల్ల ప్రయోజనాలతో పాటు ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నందున విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ ఏడాది జిల్లాలో విద్యార్థుల సంఖ్య సుమారు 2 వేల మేర పెరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మార్కులు, ఫలితాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, గౌరవ భావం పెంపొందించాలని సూచించారు. డీఈవో పి.సుశీంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, కార్పొరేటర్ గుమ్మల జానకిమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కాళం నారాయణరెడ్డి, బత్తిని బాస్కర్, నిమ్మగొట్టి జానార్దన్, పెరుమళ్ల వెంకటేశం, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అదికారులు ఎ.శ్రీనివాస్ గౌడ్, శ్రీనయ్య, రవి, సూపరింటెండెంట్ పవన్ కుమార్, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.