KTR | అదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్పిటల్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరంమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దుర్ఘటనలో ఇంకా 23 మంది పసిపిల్లలు గాయపడిన నేపథ్యంలో వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలన్నారు.
రిమ్స్ హాస్పిటల్లో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు బీఆర్ఎస్ జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా మొద్దునిద్ర పోయిన రేవంత్ సర్కారులో కనీస చలనం కనిపించలేదు. అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించడం, కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందన్నారు. ఆదిలాబాద్ రిమ్స్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రేవంత్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.