Kaveri water : తమిళనాడు-కర్ణాటక (Tamil Nadu-Karnataka) రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల (Kaveri water) వివాదంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కర్ణాటకకు 70 టీఎంసీల నీరు అదనంగా కేటాయించాలని కోరుతూ ఒక ప్రైవేటు సంస్థ వేసిన రిట్ పిటిషన్ (Writ Petition) ను కోర్టు కొట్టివేసింది. ప్రైవేటు సొసైటీల పిటిషన్లు చెల్లవని స్పష్టంచేసింది. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్ పార్టీలు లేక సొసైటీలు జోక్యం చేసుకోలేవని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఇలాంటి పిటిషన్లను విచారిస్తూ పోతే వివాదాలు ఇంకెప్పటికి ముగుస్తాయని ప్రశ్నించింది. ఇప్పటికే కావేరీ జలాలపై తమిళనాడు, కర్ణాటక చట్టపరంగా పోరాడుతున్నాయని పేర్కొన్నది. ఈ వివాదంలో ప్రైవేటు సొసైటీలకు స్థానం లేదని, రాష్ట్రాలకే మాట్లాడే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల నిర్వహణ అథారిటీ జూలై 28న కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కావేరీ బేసిన్లోని నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనడంతో తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు, కన్నడ సంఘాలు నిరసనలు చేశాయి. ఆ నేపథ్యంలో తమిళనాడులోని విజయ్ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.