పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) చేసిన ఉపాధ్యాయులకు ఇచ్చే పారితోషికం (రెమ్యునరేషన్) చెల్లింపులో విద్యాశాఖ అక్రమాలకు పాల్పడింది. గతంలో పనిచేసిన ఓ అధికారి చక్రం తిప్పి, ఒక్కో టీచర్‌కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నుంచి రూ.600 కోత పెట్టి, ఆ మొత్తాన్ని స్వాహా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయులు ఆరా తీస్తే.. ఖర్చులు పేరిట సదరు అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత ఉపాధ్యాయులు వాపోతున్నారు. ‘కష్టం ఒకరిది.. సుఖం మరొకరిది’ అన్నట్టు తమ కష్టార్జితాన్ని అధికారులు కాజేశారని ఆరోపిస్తున్నారు. ఇటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మండిపడుతున్నారు. పారితోషికంలో కోతలపై సమగ్ర విచారణ జరిపితే మొత్తం అవినీతి బయటపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదోతరగతి జవాబు పత్రాలకు సంబంధించి ఏటా జవాబు పత్రాల మూల్యాంకనం చేయడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి వచ్చిన పేపర్ల సంఖ్యను బట్టి మూల్యాంకనం కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్ (ఏఈ), చీఫ్ ఎగ్జామినర్ (సీఈ)తోపాటు క్యాంపు ఆఫీసర్లు, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, స్పెషల్ అసిస్టెంట్లను నియమిస్తారు. 2025 సంవత్సరానికి సంబంధించి.. కరీంనగర్ జిల్లాకేంద్రంలో నాలుగు జిల్లాలకు సంబంధించిన పేపర్ల మూల్యాంకనం దాదాపు పదిహేను రోజుల పాటు జరిగింది. అందుకోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన సుమారు 500పైచిలుకు ఉపాధ్యాయులను మూల్యాంకనం కోసం ఏఈలను, వందకుపైగా సీఈలను నియమించారు. మిగిలిన అవసరాల కోసం మరో వంద మందిని దాకా నియమించారు. నిజానికి గతంలో మూల్యాంకనం జరిగిన వెంటనే డబ్బులు ఇచ్చే వారు.
కానీ, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా నేరుగా ఆయా ఉపాధ్యాయుల అకౌంట్లకే పంపిస్తున్నారు. రెమ్యునరేషన్‌తోపాటు సంబంధిత ఏఈ, సీఈలకు ట్రావెలింగ్ అలవెన్స్‌లు (టీఏ), డైలీ అలవెన్స్ (డీఏ) వంటివి కూడా చెల్లిస్తున్నారు. ఒక్కో జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసినందుకు రూ.10 చొప్పున రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలా ఒక్కో ఉపాధ్యాయుడు 30 నుంచి 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. అంటే ఒక్కో ఏఈ రోజుకు సుమారు రూ.300 నుంచి రూ.400 వరకు రెమ్యూనరేషన్ వచ్చేలా పనిచేస్తారు. ఉదయం వెళ్లిన ఉపాధ్యాయులు సాయంత్రం వరకు నిక్కచ్చిగా క్యాంపు కార్యాలయంలో ఉండడంతోపాటు మూల్యాంకనం చేసిన ప్రతి జవాబు పత్రాన్ని లెక్కించి సీఈలకు అప్పగించాలి. ఏమైనా తేడాలు వస్తే.. మళ్లీ సరిచేసి ఇవ్వాలి. అందుకే మూల్యాంకనం చేయడం కత్తిమీద సాములాంటిదే. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా సదరు ఉద్యోగానికే ఎసరు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే చాలా మంది స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లడానికి జంకుతారు. వీలైనంత మేరకు మూల్యాంకన విధుల నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు.
మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులను అభినందించి, వారికి న్యాయబద్ధంగా రెమ్యునరేషన్‌ను ఇవ్వాల్సిన జిల్లా విద్యాశాఖాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనం జరిగిన అక్రమాలే. ఉపాధ్యాయుల నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 2025లో మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ నిధులను సర్కారు విడుదల చేసింది. ఆ రెమ్యునరేషన్‌ను అధికారులు యధావిధిగా ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లో జమచేయాలి. కానీ, ఒక్కో ఏఈకి చెల్లించాల్సిన పారితోషికంలో రూ.600 వరకు కోత పెట్టినట్టు సమాచారం. అలాగే స్పెషల్ అసిస్టెంట్లకు ఇవ్వాల్సిన పారితోషికం నుంచి రూ.125 వరకు కోత పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో గతంలో డీఈవో కార్యాలయంలో పనిచేసిన అధికారుల హస్తం ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, గతంలో పనిచేసిన ఓ అధికారి కీలక చక్రం తిప్పినట్టు తెలిసింది.
రెమ్యునరేషన్ విషయంలో కోతలు పెట్టిన విషయాన్ని గుర్తించిన పలువురు ఉపాధ్యాయులు.. ఆరా తీస్తే అందులో ఆ అధికారి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. ఖర్చులున్నాయని, అందుకే పారితోషికం తగ్గించామని చెప్పి సదరు అధికారి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే లోతుగా చూస్తే.. ఖర్చుల పేరిట సదరు అధికారి లక్షలాది రూపాయలను స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన జిల్లా విద్యాధికారి తన ఇష్టానుసారం వ్యవహరించారన్న విమర్శలున్నాయి. స్పాట్ వాల్యుయేషన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కొంత మంది అదనపు సిబ్బందిని కూడా నియమించినట్టు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం కోతల బాగోతం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో అప్పట్లో సౌకర్యాలు కల్పించకపోయినా, అన్నీ అసౌకర్యాలే ఉన్నా, అష్టకష్టాలకు ఓర్చి మూల్యాంకనం చేస్తే న్యాయబద్ధంగా తమకు రావాల్సిన పారితోషికంలో కోతలు ఏమిటీ?
అన్న చర్చ జోరుగా సాగుతున్నది. అంతేకాదు, దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నట్టు తెలుస్తున్నది. వందలాది మంది ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయంపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో..? చూడాలన్న చర్చ కూడా ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో నడుస్తున్నది. అలాగే ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా..? లేక కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా..? అన్నది మున్ముందు బహిర్గతమయ్యే అవకాశమున్నది. నిజానికి ఈ వ్యవహారమంతా గతంలో పనిచేసిన అధికారుల కనుసన్నల్లోనే జరిగిందన్నది వాస్తవం. ఇది ఇలా ఉంటే.. ఇటీవల సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే కాగా, అందులోనూ జిల్లా విద్యశాఖలో పనిచేసే ఓ అధికారి స్వాహాకు పాల్పడినట్టు తెలిసింది. సర్పంచ్‌లు రాకపోయినా.. మొత్తం మంది వచ్చినట్టు చూపి.. ఆ డబ్బులను కాజేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలోనూ తీగలాగితే డొకంతా కదిలే అవకాశం ఉన్నది. సర్పంచుల సొమ్ము స్వాహా చేసిన సదరు అధికారి డీఈవో కార్యాలయంలో అనేక విషయాల్లో చక్రం తిప్పారనే విమర్శలున్నాయి. ఆయనపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. సర్పంచుల శిక్షణ కార్యక్రమాలు.. సదరు అధికారి స్వాహా చేసిన సొమ్ము వివరాలు కూడా త్వరలో బహిర్గతం కానున్నాయి.