ఎన్నికల సంఘం పనితీరు రోజురోజుకూ అనుమానాస్పదం అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎన్నికల కమిషన్ ‘సర్’ ప్రక్రియ నిర్వహణలో ప్రధాన కమిషనర్ (సీఈసీ)కి, ఇద్దరు కమిషనర్లకు మధ్య అభిప్రాయభేదాలు పొడసూపడం, అవి చినికి చినికి గాలివానగా మారి మీడియాకు పొక్కడంతో ఇప్పటివరకు ఊహాగానాల రూపంలో కొనసాగిన అనుమానాలు ఇపుడు బలపడ్డాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పనితీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆయన పనితీరుపై ఏకంగా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి కమిషనర్లు ఫిర్యాదు చేసినట్టు వెలువడిన వార్తలు కమిషన్ కన్నా ఎక్కువగా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేశాయి.
ఎన్నికల వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై నీలినీడలు అలుముకోవడం విచారకరం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొదలైనప్పటి నుంచీ దాని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. అది సవరణ కాదని, పాలక పక్షానికి అనుకూలంగా ఓట్ల తొలగింపు మాత్రమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికితోడు సీఈసీ వ్యవహార శైలి కూడా అభ్యంతరకరంగా ఉండటంతో కమిషన్ విశ్వసనీయత దెబ్బతిన్నది. ఆయన ఎన్నికల అధికారిలా కాకుండా చవకబారు రాజకీయ నాయకునిలా మాట్లాడుతుండటం చర్చనీయాంశమవుతున్నది.
ఆటలో రిఫరీ తటస్థంగా ఉండాలి అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు తొండాట ఆడకుండా చూడాల్సిన ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబించినట్టు కనిపించడం ఏమాత్రం అభిలషణీయం కాదు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగకపోతే ప్రజాస్వామ్యమే అర్థరహితం అవుతుంది. ఇటీవలి కాలంలో, మరీ ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక ఒకటొకటిగా రాజ్యాంగ సంస్థలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని తాకట్టు పెట్టి సర్కార్‌కు ‘జీ హుజూర్.. జో హుకుం’గా తయారు కావడమనే విపరీత ధోరణి మొదలయ్యింది. ఆ జాబితాలో ఎన్నికల సంఘం చేరడం ప్రజాస్వామ్యానికి ఉత్పాతమే. ఇటీవలి కాలంలో ఈసీ పాలక పక్షానికి పూర్తి అనుకూలంగా వ్యవహరించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి.
టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నరోజుల్లో ఏకవ్యక్తి ఆధిపత్యం పతాకస్థాయికి చేరుకోవడంతో భిన్నమైన ఆలోచనలకు వీలు కల్పిస్తూ ముగ్గురు కమిషనర్ల పద్ధతి ప్రవేశపెట్టారు. అయినప్పటికీ సదరు ముప్పేటవ్యవస్థను తోసిరాజని ప్రస్తుత సీఈసీ ఇష్టారాజ్యం చెలాయిస్తున్నారని అనడానికి గత 10 నెలల కాలంలో 14 సార్లు కమిషనర్లు ఫిర్యాదు చేయడంతో కమిషన్ వ్యవహారశైలిపై ప్రశ్నలు రేకెత్తుతు న్నాయి. కమిషనర్లు సీఈసీపై చేసిన ఫిర్యాదుల్లో ప్రధానమైనవి ఎన్నికల డాటాబేస్ కేంద్రీకరణ, ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే ఫామ్ 6 మార్చేయడం, ఓటర్ల చేర్పునకు వ్యతిరేకంగా అప్పీళ్లను అనుమతించడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా గోవాలో అర్హులైన 97 మంది ఓటర్లకు జాబితాలో చో టు దక్కకపోవడం అనేది మరో ఫిర్యాదు. తనమీద కమిషనర్లే ఫిర్యాదులు చేస్తుంటే సీఈసీ మాత్రం ‘ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నట్టు’ బుకాయించడం ఏ మాత్రం సరైంది కాదు.
ఇదంతా చినికి చినికి కాలివానగా మారిన ట్టు తాజాగా కమిషనర్ల ఎంపిక ప్రక్రియ కూడా వివాదాల్లో చిక్కుకోవడం చాలా దారుణం. ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ ఉండాలని సుప్రీంకోర్టు ఇదివరకు సూచించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ సూచనను తుంగలో తొక్కి సీజేఐ స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేరుస్తూ 2023లో చట్టం తెచ్చింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విస్తృత స్థాయిలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి దానిని పంపించాలని నిర్ణయించడం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది.
సీజేఐని తప్పించి కేంద్ర మంత్రిని చేర్చడం సర్కార్ చేతికి వీటో ఇవ్వడమేనని, తర్కానికి నిలువని ఈ చర్య ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నదని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తిచూపడం సర్కార్‌కు చెంపపెట్టు. ఈ వివాదాల నేపథ్యంలో సీఈసీ రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల వ్యవస్థ గౌరవమర్యాదల కోసమైనా ఆయన పదవి నుంచి వైదొలగడం విజ్ఞత కలవారు చేసే పని. కేంద్రం కూడా అనుమానాల నివృత్తికి వివాదంపై ప్రత్యేక సమగ్ర దర్యాప్తు జరిపించడమూ అవసరమే. అయితే బీజేపీ సర్కార్ దానికి సిద్ధపడుతుందనుకోవడం అత్యాశే!