MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక, మార్చి 22 : మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నా నియోజకవర్గ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఉప కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతోనే సమస్య నెలకొందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శాసనసభలో ప్రస్తవించారు. శనివారం అసెంబ్లీలో దుబ్బాక నియోజకవర్గంలో సాగునీరు, కరెంట్, మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన నిధుల గురించి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రస్తవించారు.
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టున్నా నియోజకవర్గంలో సాగునీటి సమస్యతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై భారీ నీటిపారుదల శాఖ మంత్రికి విన్నవించిన ఫలితం లేకపోయిందన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టుల నుండి దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు వస్తుందని, ఇందులో 10, 11,12,13 ప్యాకేజీల ద్వారా ఉప కాల్వలు నిర్మించాల్సి ఉందన్నారు.
ఉప్పరపల్లి కెనాల్, శంకరంపేట కెనాల్, రామయంపేట కెనాల్, సిద్దిపేట కెనాల్లు (ప్రధాన కాల్వలు) ఉన్నాయని, వీటినుండి పిల్ల కాల్వల నిర్మాణం పూర్తికాక సంబంధిత గ్రామాల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యేడు ఉప కాల్వల ద్వారా సాగునీరు వస్తుందని చాలా మంది రైతులు వరి నాట్లు వేసి, సాగునీరందక నష్టపోయారని తెలిపారు.
సొంత డబ్బులతో కాల్వలు తీసుకుంటున్న ప్రభుత్వ స్పందన లేదు..
తమ సొంత మండలం దుబ్బాకలోని అచ్చమాయిపల్లి-పోతారం పిల్ల కాల్వ నిర్మాణం చేపట్టకపోవడంతో అక్కడి రైతులు సాగునీటి గోస వెల్లదీస్తున్నారని తెలిపారు. అక్కడి రైతులు తమ సొంత డబ్బులతో కాల్వలు తీసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఉప కాల్వల నిర్మాణంపై మెగా ఏజేన్సీ వారు పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా సంబందిత అధికారులతో, ఏజేన్సీవారితో మాట్లాడి త్వరగా ఉప కాల్వలను నిర్మించి సమస్య పరిష్కరించాలన్నారు.
రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు..
దుబ్బాక నియోజకవర్గంలో కరెంట్ సమస్య నెలకొందని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లారు. అస్తవ్యవస్తమైన కరెంట్ సరఫరాతో తరచు వ్యవసాయ మోటర్లు, ట్రాన్సుఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. ట్రాన్సుపార్మర్లు, కరెంట్ పోల్స్ రైతులకు ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ అధికారులు స్టోర్స్‌లలో సామాగ్రి లేదని చెబుతున్నారని తెలిపారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు రైతులు డీడీలు కట్టినా ఇవ్వడం లేదన్నారు.
దుబ్బాక మున్సిపల్‌కు మంజూరైన రూ.20 కోట్లు విడుదల చేయాలి..
దుబ్బాక మున్సిపల్‌కు గతంలో టీయూఐఎఫ్డీసీ ద్వారా రూ. 20 కోట్లు మంజూరయ్యాయని, వెజ్అండ్ నాన్బేజ్ మార్కెట్, టౌన్‌హాల్ తదితర వాటికి ప్రోసిడింగ్లు అందజేస్తే , మున్సిపల్‌కు మంజూరైన నిధులు తమ కాంగ్రెస్ ప్రభుత్వం రద్ధు చేసిందన్నారు. వెంటనే ఆ నిధులు తిరిగి విడుదల చేసి దుబ్బాక మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు