తొగుట, మే 05 : వడగండ్ల వర్షంతో చేతికి వచ్చిన పంట నేల రాలిపోవడంతో రైతులు బోరుమని విలపిస్తుంటే, వారికి భరోసా ఇవ్వాల్సిన జిల్లా కలెక్టర్ భూ భారతి మీటింగ్‌కు వెల్లడం చూస్తే రైతులపై పాలకులకు ఏ పాటి శ్రద్ధ వుందో అర్థమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వడగండ్ల వర్షంతో తొగుట మండలంలో పంటలకు తీవ్రనష్టం వాటిల్లగా కాన్గల్, లింగంపేటలలో వరి పంటలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పరిశీలించారు.
అలాగే లింగంపేటలో సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్‌లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికి సకాలంలో ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడంతో ఆలస్యంగా వరినాట్లు వేయడంతో పంట ఆలస్యమైందన్నారు. పంట నూర్పిడిలో ఆలస్యం కావడంతో నేడు కురిసిన వడగండ్ల వర్షం మూలంగా వరి పంటకు అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపేట, కాన్గల్, తొగుట, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్, గుడికందుల, గోవర్ధనగిరి తదితర గ్రామాల్లో పూర్తి స్థాయిలో పంట, ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.
పంట నష్టపోయిన విషయం తెలియగానే రైతులను పరమార్శించి భరోసా కల్పిద్దామని జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేయగా, తాను హుస్నాబాద్‌లో భూ భారతి కార్యక్రమంకు వెళ్లానని చెప్పడంతో ఖంగుతిన్నానన్నారు. వడగండ్ల వర్షంతో రైతులు విలపిస్తుంటే పంట పొలాలను సందర్శించి రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పాలకులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. రైతులు కష్టాల్లో ఉండి రోడ్ల మీద విలపిస్తుంటే పాలకులకు పట్టింపులేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు రూ.35 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, మండల వ్యవసాయాధికారి మోహన్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, బోదనం కనకయ్య, వేల్పుల స్వామి, సుతారి రమేష్, మంగ నర్సింహులు, గొడుగు ఐయిలయ్య, మంగ యాదగిరి, ఎల్లం, ప్రవీణ్‌రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్, అశోక్, మధుసుదన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీధర్, బైరాగౌడ్, మల్లయ్య, నర్సాగౌడ్, కర్ణాకర్, స్వామిగౌడ్, రాములు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.