MLA Kotha Prabhakar Reddy | తొగుట : కార్యకర్తల భిక్షతోనే తాను ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని, వారి రుణం తీర్చుకోలేనిదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజోతోత్సవ సభ సందర్బంగా తొగుట మండల పార్టీ నాయకులతో తుక్కాపూర్లోని లక్ష్మి నర్సింహస్వామి ఫంక్షన్ హాల్లొ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నేను ఆపదలో ఉన్నా మీరంతా ఒక్కటై నాకు ఘన విజయం అందించారని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అని, బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగిందన్నారు.
మా పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే..
కేసీఆర్ హయాంలోనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులతోపాటు ప్రధాన కాలువలు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఉప కాలువలు నిర్మించి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలని ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మల్లన్న సాగర్ నీళ్లు బయటకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
నీళ్ల కోసం దుబ్బాక నియోజకవర్గ రైతులు అల్లాడుతుంటే, డిపాజిట్ రాని వాళ్లు కొబ్బరికాయలు కొట్టడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసే వారికి, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. రజతోత్సవ సభకు చీమల దండులా తరలివొచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు కే హరికృష్ణా రెడ్డి, కుర్మ యాదగిరి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు గడీల అనిత లక్ష్మారెడ్డి, బక్క కనకయ్య, బోధనం కనకయ్య, నాయకులు వేల్పుల స్వామి, మాదాసు అరుణ్ కుమార్, నందారం నరేందర్ గౌడ్, బాలరాజు తదితరులు మాట్లాడారు.. కార్యక్రమం లో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.