జనగామ రూరల్, ఏప్రిల్ 14: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) డిమాండ్ చేశారు. సోమవారం జనగామ మండలం సిద్దంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందించాలన్నారు. వానల వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయాలని వెల్లడించారు.
మామిడి, బత్తాయి, సపోటా తదితర పంటలు గాలి దుమారానికి పూర్తిగా ధ్వంసమయ్యాయని, వాటిని కూడా సర్వే జరిపి ఆ రైతులను కూడా నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సంబంధిత మంత్రితో మాట్లాడామని, ఇక్కడి రైతులను ఆదుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, ఏడీఏ బీన, ఏవో కరుణాకర్, ఏఈఓ రిషిత, మాజీ మార్కెట్ చైర్మన్ బల్దే సిద్ధి లింగం, మండల పార్టీ అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్, రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు బురెడ్డి ప్రమోద్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద, మహిళా అధ్యక్షురాలు రేఖ, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల స్వామి, నాయకులు ఎర్ర సుజాత, దయాకర్, మడిపల్లి సుధాకర్ గౌడ్, పుప్పాల మల్లయ్య, కరుణాకర్, బోళ్ల అంజయ్య, కావిడే నగేష్, బీదర్ రవీందర్, గాజుల నరేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.