చిన్న కోడూర్, మే 07 : మన దేశ సైనికులకు శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత దయ ఉండాలి. పాకిస్తాన్తో విరోచితంగా పోరాడిన దేశ సైనికులకు విజయం చేకూరాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన కళ్యాణోత్సవంలో హరీశ్ రావు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాచాపూర్ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
అమ్మవారి దయతో వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురువాలని అన్నారు. ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఒకప్పుడు మన మాచాపూర్ గ్రామం చెరువు నిండాలంటే కప్పతల్లి ఆట ఆడేవాళ్లు అన్నారు. కానీ ఇవాళ కాళేశ్వరం, రంగనాయక సాగర్ కట్టిన తర్వాత ఏడాదికి రెండు పంటలు పండించుకొని రైతులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రూ.2500 పత్తాలేదు, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు బందయిపోయాయి.
కల్యాణలక్ష్మికి తులం బంగారం కలుపుతాం అన్నారు. కానీ పిల్లలు పుట్టినా చెక్ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు ఈ ప్రభుత్వం పాలన చెయ్యాలె. అప్పుడే ప్రజలకు పాలేందో, నీళ్లేందో అర్ధం అవుతుందని తెలిపారు. ఈ కార్య్రకమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, మాజీ సర్పంచ్ సుంచు ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.