రాయపోల్, జూలై 05: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉన్నది. తరుచూ చిరుతపులి (Leopard) కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేలల్లో తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. వడ్డేపల్లికి చెందిన యాదగిరి 40 రోజుల క్రితం పొలం వద్ద కోతుల బారి నుంచి రక్షణకై రెండు కుక్కలను కట్టివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా రెండు కుక్కలను చిరుత పులి చంపివేసి తిన్నది. అంతకుముందు అటవీ ప్రాంతంలో లేగ దూడలను లాక్కెళ్లి చంపేసింది. ఏడు నెలల క్రితం రెండు పిల్లలతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది.
గ్రామానికి చెందిన లొచ్చు నవీన్‌కుమార్ బర్రెలను పెంచుకుంటున్నాడు. తన బర్రెలను మేపడం కోసం బొంతల గట్టు సమీపంలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలో ఏపుగా పెరిగిన గడ్డిలో చప్పుడు రావడంతో అటువైపు చూశాడు. అక్కడ పులి కనిపించడంతో తన ఫోన్లో ఫొటోలు తీసి బర్రెలను తోలుకొని ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ పులి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పులి సంచరించిన ప్రాంతం వైపు వెళ్లాలంటే రైతులు, ప్రజలు జంకుతువుతున్నారు.