Leopard Roaming | రాయపోల్ : చిరుత పులి రాయపోలు వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది. గ్రామ పరిసరాల్లో తిరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల కిందట తిమ్మక్కపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరింది. గల్వాన్ చెరువు పక్కన సంచరిస్తుండగా.. ఓ వ్యక్తి చిరుత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పొల్లాల్లో చిరుత సంచరిస్తుందని తెలియడంలో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు విషయం తెలుసుకొని.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
అక్కడ చిరుత ఆనవాళ్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. తాజాగా రాయపోల్ మండల కేంద్రంలోని ఇప్పలగడ్డ సమీపంలో చిరుత ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచరిస్తుందని.. పొలాల వద్దకు వెళ్లేవారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దాంతో రాత్రిళ్లు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయని.. మరో వైపు చిరుత సంచారంతో బావుల వద్దకు వెళ్లలేక పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్టు అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.