న్యూఢిల్లీ, మార్చి 2: దేశీయ పారిశ్రామిక రంగం పడకేస్తున్నది. తయారీ, గనులు రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా జనవరి నెలలో పారిశ్రామిక ప్రగతి మూడు నెలల కనిష్ఠ స్థాయిని తాకి 4.8 శాతానికి పడిపోయింది. గడిచిన మూడు నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి వృద్ధి కావడం విశేషం. క్రితం ఏడాది ఇదే నెలలో ఐఐపీ వృద్ధి 5.1 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 0.5 శాతం పారిశ్రామిక ప్రగతి ఆ మరుసటి నెల నవంబర్‌లో 7.2 శాతం వృద్ధిని సాధించినట్టు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ సోమవారం తాజాగా వెల్లడించింది. అలాగే డిసెంబర్ 2025 నెల పారిశ్రామిక వృద్ధిరేటును 7.8 శాతానికి బదులు 8 శాతానికి సవరించింది.
ఈ ఏడాది తొలి నెలలో తయారీ రంగంలో వృద్ధి 4.8 శాతానికి పడిపోయిందని తెలిపింది. కిందటేడాది ఇది 5.8 శాతంగా ఉన్నది. అలాగే గనుల రంగంలో వృద్ధి 4.4 శాతం నుంచి 4.3 శాతానికి జారుకున్నదని వెల్లడించింది. కానీ, పవర్ రంగంలో వృద్ధి రెండింతలు పెరిగి 5.1 శాతానికి పెరిగింది. ప్రాథమిక వస్తువుల్లో వృద్ధి 3.1 శాతం కాగా, క్యాపిటల్ గూడ్స్‌లో 4.3 శాతం, మధ్యస్త వస్తువులు 6 శాతం, ఇన్ఫ్రా/నిర్మాణ రంగ వస్తువుల్లో వృద్ధి అత్యధికంగా 13.7 శాతంగా నమోదైంది. మొత్తం 23 ఇండస్ట్రీ గ్రూపుల్లో 14 రంగాలు ఆశావహ పనితీరు కనబర్చుగా, కేవలం తొమ్మిది ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో పారిశ్రామిక రంగంలో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఇది 4.2 శాతంగా ఉన్నది.