– ఉచిత యూనిఫామ్లు, ‘సీఎం కిట్’లు వెంటనే పంపిణీ చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి
– బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
నల్లగొండ రూరల్, ఆగస్టు 14 : నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం పేద విద్యార్థుల సంక్షేమాన్ని సంపూర్ణంగా గాలికి వదిలేసిందన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా, ఆగస్ట్ 15 జాతీయ పండుగ వేళ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు అందించకపోవడం పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి, పరాకాష్టకు సజీవ సాక్ష్యమని దుయ్యబట్టారు.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు 9 రకాల నాణ్యమైన వస్తువులతో ‘సీఎం కిట్’ అందిస్తామని ప్రచార ఆర్భాటం చేసిన పాలకులు, ఆచరణలో మాత్రం రూపాయి కూడా కేటాయించకుండా విద్యార్థులను మోసం చేశారని చెప్పారు. కార్పొరేట్ విద్యకు కొమ్ముకాస్తూ, ప్రభుత్వ బడులను సంపూర్ణంగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే నిధుల కేటాయింపులో, కనీస వసతుల కల్పనలో ప్రభుత్వం ఈ రకమైన అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిమ్మకు నీరెత్తిన వైఖరిని వీడి, యుద్ధ ప్రాతిపదికన నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన యూనిఫామ్లు, ‘సీఎం కిట్’లను తక్షణమే పంపిణీ చేయాలన్నారు.
లేనిపక్షంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సమీకరించి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, విద్యాశాఖ అధికారుల కార్యాలయాల దిగ్బంధనం, రాష్ట్రవ్యాప్త ఉధృత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బిసి యోజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనంత నాగరాజుగౌడ్, విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్, సతీష్, నాగరాజు, మహేష్, శివ, పృథ్వీరాజ్, నాగరాజ్, పృద్వి, రవి, తరుణ్, రాజు పాల్గొన్నారు.