దుబాయ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మధ్య ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో సాధారణ జనజీవితంతో పాటు క్రీడాకారులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు కీలక టోర్నీలు ఆడేందుకు గాను దుబాయ్, దోహా, ఖతార్‌కు వచ్చిన, ఆ దేశం మీదుగా వెళ్తున్న పలువురు క్రీడాకారులు.. ఆయా దేశాల గగనతలాలు మూసేయడంతో ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. అదీగాక గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఆ దేశాల్లో జరగాల్సిన ప్రధాన టోర్నీలు కొన్ని వాయిదాపడ్డాయి. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులతో వారంతా అక్కడి విమానాశ్రయాలు, సంబంధిత టోర్నీ నిర్వాహకులు ఏర్పాటుచేసిన హోటల్స్‌లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు.
ఫ్రెండ్ ఇంట్లో మెద్వెదెవ్
దుబాయ్‌లో ఇటీవలే ముగిసిన ఏటీపీ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఆడేందుకు వచ్చి సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచిన రష్యా ఆటగాడు డేనిల్ మెద్వెదెవ్.. ఇరాన్ దాడులతో అక్కడే ఆగిపోయాడు. ఈ మాజీ ప్రపంచ నంబర్‌వన్.. తన కుటుంబ సభ్యులు, కోచింగ్ సిబ్బందితో కలిసి స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నాడు. దుబాయ్ ఏటీపీ నిర్వాహకులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మెద్వెదెవ్‌తో పాటు పలువురు టెన్నిస్ ఆటగాళ్లు దుబాయ్‌లోనే చిక్కుకుపోయినట్టు తెలుస్తున్నది.
ఫిబా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ వాయిదా
లెబనాన్‌లో సోమవారం మొదలుకావాల్సిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి బాస్కెట్‌బాల్ (ఫిబా) వరల్డ్ కప్ -2027 క్వాలిఫయర్ టోర్నీ వాయిదాపడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నీని వాయిదా వేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. గ్రూప్-డీలో భారత్.. శుక్రవారం ఖతార్‌తో మ్యాచ్‌లో ఓడగా లెబనాన్‌తో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి భారత బాస్కెట్‌బాల్ జట్టు ఆటగాళ్లు దోహాలో ఉన్నారు.
అల్బేనియాలో రెజ్లర్లు
అల్బేనియాలో ఇటీవలే ముగిసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన 16 మంది భారత రెజ్లర్లు అక్కడే నిలిచిపోయారు. ఈ టోర్నీలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు సాధించి స్వదేశానికి బయల్దేరిన భారత రెజ్లర్లు.. మధ్య ఆసియాలో ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అల్బేనియాలోనే ఆగిపోయినట్టు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తెలిపింది.
ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్పై అనిశ్చితి
ఈనెల 6-8 మధ్య మెల్బోర్న్లో మొదలుకావాల్సి ఉన్న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్పై అనిశ్చితి కొనసాగుతున్నది. ఫార్ములా వన్ సీజన్ తొలి రేస్ అయిన ఈ టోర్నీలో పాల్గొనేందుకు పలువురు రేసర్లు దుబాయ్, దోహా మీదుగానే రావాల్సి ఉంది. అయితే పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన ఆస్ట్రేలియా ఫార్ములా1 చీఫ్ ట్రావిస్ ఆల్డ్.. టోర్నీని షెడ్యూల్ ప్రకారం జరిపించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు.
లంక, ఆఫ్ఘాన్ సిరీస్ కష్టమే..
శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ మధ్య దుబాయ్‌లో ఈనెల 13 నుంచి 25 వరకు జరుగబోయే టీ20, వన్డే సిరీస్‌లు కూడా భద్రతాకారణాలతో వాయిదాపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
సింధు.. కీలక టోర్నీకి దూరం!

రెండుసార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుంది. బ్రిటన్‌లో మంగళవారం నుంచి మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడేందుకు దుబాయ్ మీదుగా లండన్ వెళ్లాల్సిన ఆమె.. ఇరాన్ దాడుల కారణంగా దుబాయ్‌లోనే ఆగిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఆమె మంగళవారం.. తన మొదటి రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని మరికొన్ని రోజులు మూసి ఉంచే అవకాశమే ఎక్కువ. ఈ నేపథ్యంలో సింధు ఈ టోర్నీలో పాల్గొనడం ఇక కష్టమే. ఆదివారం సింధు తానుంటున్న విమానాశ్రయానికి చేరువలోనే భారీ పేలుళ్లు సంభవించాయని, అయితే ఆ తర్వాత తమను సురక్షిత ప్రాంతానికి తరలించారని వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇరాన్.. ఫిఫా ఆడుతుందా?

తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో యూఎస్, కెనడా, మెక్సికోలో జరుగబోయే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్ (ఫిఫా)లో ఇరాన్ ఆడుతుందా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. ఫిఫా వరల్డ్ కప్‌నకు అర్హత సాధించిన ఇరాన్.. బెల్జియం, ఈజిప్ట్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-జీలో ఉంది. తమ దేశంలో యూఎస్ జరుపుతున్న దాడుల నేపథ్యంలో ఇరాన్.. అమెరికాలో ప్రపంచకప్ ఆడుతుందా? అన్నదానిపై ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మెహ్ది తాజ్ మాట్లాడుతూ.. ‘ఈ దాడుల తర్వాత మనం ప్రపంచకప్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని ఆశించలేం’ అని చెప్పడం గమనార్హం. ఇప్పటికే ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ).. చాంపియన్స్ లీగ్ వెస్ట్ జోన్ ప్లేఆఫ్ మ్యాచ్‌లను వాయి దా వేసిన విషయం తెలిసిందే. పర్షియన్ గల్ఫ్ ప్రో లీగ్‌లో మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి.