Komuravelli | చేర్యాల, మార్చి 9 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు పరవశం చెందుతున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి, కొమురవెల్లి మల్లన్న కోటి దండాలు అనే నినాదాలతో మల్లన్న క్షేత్రం మార్మోగుతున్నది.8వ ఆదివారం సందర్భంగా 50వేల మందికి పైగా భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో కే.రామాంజనేయులు తెలిపారు.
8వ ఆదివారం సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులు, ప్రైవేటు గదులు కిరాయికి తీసుకుని అందులో బస చేశారు. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్ర లేచి గదుల్లో పవిత్ర స్నానం అచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో 4 గంటల పాటు వేచి ఉన్నారు. ధర్మ దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శరానికి మూడున్నర గంటలు, వీవీఐపీ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు.
స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాకుండా మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి ఒడి బియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సిబ్బంది,అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీను, ఎస్ఐ నాగరాజు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా వేసవి కాలం కావడంతో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసినట్లు ఈవో తెలిపారు.