‘నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ‘విష్ణు విన్యాసం’. నేను యువతనీ, కుటుంబ ప్రేక్షకులనూ నమ్ముకునే సినిమాలు చేస్తుంటా. వారి స్పందన తొలి రెండుమూడు ఆటల నుంచే కనిపించింది. థియేటర్లన్నీ ఆడియన్స్‌తో నిండిపోతున్నాయి. ఈ వారమంతా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన వినోదాత్మక కుటుంబకథాచిత్రం ‘విష్ణు విన్యాసం’. నయన్సారిక కథానాయిక. యదునాథ్ మారుతీరావు దర్శకుడు. సుమంత్ నాయుడు.జి నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో శ్రీవిష్ణు మాట్లాడారు. ‘ఎలా జరిగిందో తెలీదుకానీ.. ఈ సినిమా అంతా డిసెంబర్లో లీక్ అయిపోయింది. కానీ పుటేజ్‌ని మాత్రం బయటకు వదల్లేదు. మా నిర్మాతకు ఫోన్ చేసి వదలుతామని బ్లాక్మెయిల్ చేశారు. ఈ వ్యవహారమంతా చెన్నై కేంద్రంగా జరిగింది. ఈ బెదిరింపుల పర్వం విడుదల ముందురోజు వరకూ నడుస్తూనేవుంది.
దాంతో సినిమాను త్వరగా విడుదల చేయాలని నిశ్చయించుకొని ఇరవై రోజుల పనిని ఏడు రోజుల్లో రాత్రి, పగలు విరామం లేకుండా పనిచేసి పూర్తి చేశాం. అంత కష్టపడ్డాం కాబట్టే ఈ టైమ్‌కి రాగలిగాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు నడుస్తున్నది’ అని తెలియజేశారు శ్రీవిష్ణు. ఇంకా నయన్సారిక, సంగీత దర్శకుడు రథన్, నిర్మాతలు సుమంత్‌నాయుడు.జి, సుబ్రమణ్యం కూడా మాట్లాడారు.