మలబారు ముద్దుగుమ్మ రెబా మోనికా జాన్.. ‘సామజవరగమన’ అంటూ టీటౌన్లో అడుగుపెట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’లో ‘స్వాతిరెడ్డి’
పాటతో కుర్రకారుకు పిచ్చెక్కిచ్చింది. టాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలను దక్కించుకుంటున్నది. తాజాగా, ‘మృత్యుంజయ్’తో మరోసారి తెలుగు అభిమానులను ఆకట్టుకున్న మోనికా.. చెప్పిన కార్వాన్ ముచ్చట్లు!
మాది కేరళ. పెరిగింది మాత్రం బెంగళూరులో! చదువు పూర్తయిన తర్వాత కొన్ని యాడ్స్ చేశా. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో అవకాశం వచ్చింది. ‘ఫోరెన్సిక్’ సినిమా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక మాది ప్రేమ వివాహం. మా ఆయన జోమాన్ జోసెఫ్. 2022లోనే మా పెళ్లయ్యింది.
సినిమాలో పాత్ర నిడివికన్నా.. ఆ పాత్ర ప్రాముఖ్యతే నాకు ముఖ్యం. కథకు కీలకంగా అనిపిస్తే.. చిన్న క్యారెక్టర్లు చేయడానికి కూడా సిద్ధం.
నేను తెలుగులో చేసిన మొదటి సినిమా.. ‘సామజవరగమన’ అనే అందరూ అనుకుంటారు. కానీ, అంతకుముందే ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ చిత్రంలో నటించా. కానీ, ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ‘బ్రో’ సినిమా లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చా. ఆ సమయంలోనే నిర్మాత రాజేష్ గారిని కలిశా. కథ నచ్చడంతో ఆ సినిమాకు ఓకే చెప్పా. అలా, ‘బ్రో’ మిస్ అయినా.. ‘సామజవరగమన’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యా!
నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ‘బ్రో’లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోల్పోయా. తమిళంలో దళపతి విజయ్‌తో నటించాలని కోరికగా ఉండేది. అది ‘బిగిల్’తో తీరింది. అందుకే, భవిష్యత్తులోనైనా పవర్‌స్టార్‌తో నటించే అదృష్టం వరిస్తుందని ఆశిస్తున్నా.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కొంతమంది ఎలాంటి భయం లేకుండానే కమిట్మెంట్ అడిగేస్తారు. కెరీర్ మొదట్లో నేను కూడా ఇలాంటి వేధింపులకు గురయ్యా. ఆఫర్స్ కోసం వెతుకుతున్నప్పుడు కొందరు ఇబ్బంది పెట్టారు. ‘డేటింగ్‌కు వస్తావా?’ అంటూ సతాయించారు.
మనం అనుకున్నట్లు జరిగితే.. అది జీవితం ఎలా అవుతుంది? నా విషయంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. రజినీ సర్ హీరోగా వచ్చిన ‘కూలీ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆ సినిమా నాకు మంచి బ్రేక్ ఇస్తుందని భావించా. కానీ, అది నేను అనుకున్నట్లు తెరకెక్కలేదు. నా పాత్ర ఇంకాస్త ఉంటే బావుండేది అనిపించింది. అయినా, రజినీకాంత్ సినిమాలో నటించడం మాత్రం ఆనందాన్ని కలిగించింది.