సిద్దిపేట కమాన్, డిసెంబర్ 16: ఆరోగ్యమే మహాభాగ్యం.. మంచి ఆరోగ్యానికి మించినది లేదు.. మనం తీసుకునే పోషకాల ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సిద్దిపేటలోని హెడ్ పోస్టాఫీసు వద్ద ఓ చిరువ్యాపారి 16 రకాలకు సంబంధించి ఎన్నో పోషక విలువలు గల ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్ కేవలం రూ.40కే విక్రయిస్తూ ఉపాధి పొందుతు న్నాడు. నిత్యం పట్టణ ప్రజలతో పాటు వాకర్స్, విద్యార్థులకు పోషకాల ఆహారాన్ని అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్నాడు.
మెదక్ రోడ్డులో…
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మార్నింగ్ ఫ్రూట్స్ పేరుతో సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్డులో ఓ చిరువ్యాపారి 16 రకాల ఫ్రూట్స్ వాటర్ మిలన్, బొప్పాయి, పైనాపిల్, జామ, బీట్రూట్, క్యారెట్, డ్రాగన్ ఫ్రూట్, కీర దోస, కర్జురా, దానిమ్మ, బాదం, కాజు, కిస్మిస్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తేనె, ద్రాక్ష కేవలం రూ.40కే అందజేస్తున్నాడు. ఇక్కడ టేస్టు చేసిన వారు చాలా బాగుందని.. ఉదయమే ఆయిల్ ఫుడ్ ఇతర జంకు ఫుడ్ కంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు. ఉదయాన్నే వాకింగ్ చేసే వారంతా ఇక్కడ మార్నింగ్ ఫ్రూట్స్‌కు అలవాటుపడిపోయారు. రకరకాల టిఫిన్స్ చేసే బదులు 16 రకాలకు సంబంధించి అన్ని పోషకాలు మార్నింగ్ ఫ్రూట్స్ ఉదయమే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పార్సిల్స్ తీసుకువెళ్తున్నారు. విద్యార్థులు కూడా వీటిని ఇష్టంగా తింటున్నారు.
ప్రజల ఆరోగ్యానికే..
లాభాపేక్ష లేకుండా మార్నింగ్ ఫ్రూట్స్ పేరుతో చిరువ్యాపారం చేస్తున్నా. 16 రకాలకు సంబంధించి పోషకాలు గల ఫ్రూట్స్ అందిస్తున్నా. కొనుగోలు చేసిన ప్రజలు చాలా బాగున్నాయంటూ అభినందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నావని ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారం బాగానే ఉంది. – సాయికిరణ్, చిరువ్యాపారి, సిద్దిపేట
ఆరోగ్యానికి మంచిదని
ఉదయమే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అన్ని రకాల పండ్లు వస్తున్నాయి. టిఫిన్స్‌కు బదులు పండ్లు తీసుకోవాలి. రుచి కూడా బాగుంటున్నాయి. ప్రజల కోసం ఇక్కడ దుకాణం ఏర్పాటు చేయడం సంతోషం.
– రంజిత్‌కుమార్, వినియోగదారుడు
రోజూ వస్తుంటా
టిఫిన్స్ తినే బదులు రోజూ పొద్దున్నే పండ్లు తింటున్నా. ఏ పండ్లు కొన్నా ప్రస్తుతం 50 రూపాయలకుపైనే ఉంటాయి. కానీ 16 రకాల పండ్లు ఒకేచోట రూ.40 లభించడం సంతోషంగా ఉంది. నేను తినడమే కాకుండా కుటుంబీకులకు తీసుకువెళ్తున్నా. ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
– కె. చంద్రం, వినియోగదారుడు